దాదాపు 18 కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా వున్న క్రిమినల్ ఢిల్లీ పోలీసుల కస్టడీలో మరణించడం జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. మృతుడిని షేక్ సహదత్‌గా గుర్తించారు. ఇతనిపై ఆయుధాల చట్టం కింద అభియోగాలు వున్నాయి.
దాదాపు 18 కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా వున్న క్రిమినల్ ఢిల్లీ పోలీసుల కస్టడీలో మరణించడం జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. వాయువ్య ఢిల్లీలోని నేతాజీ సుభాష్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో 18 కేసుల్లో నిందితుడిగా వున్న క్రిమినల్ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడిని షేక్ సహదత్‌గా గుర్తించారు. ఇతనిపై ఆయుధాల చట్టం కింద అభియోగాలు వున్నాయి. వాయువ్య ఢిల్లీలోని జహంగీర్‌పురిలో మృతుడు నివసిస్తున్నాడు. ఆయుధాల చట్టం కింద షేక్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
జహంగీర్‌పురి హెచ్ బ్లాక్‌కు చెందిన మృతుడి వయసు 36 ఏళ్లు. జూలై 21న సుభాష్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో ఆయుధాల చట్టంలోని 25/35/54/59 సెక్షన్ల కింద అతనితో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. మృతుడిని ఒక రోజు విచారణ నిమిత్తం కస్టడీలో వుంచామని, అతనితో పాటు ఇతర నిందితులు కూడా జ్యుడీషియల్ కస్టడీలోనే వున్నారని పోలీసులు వెల్లడించారు.
నియమ నిబంధనల ప్రకారం జూలై 22 సాయంత్రం మృతుడికి వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆపై పోలీస్ స్టేషన్‌లోని లాకప్‌లో వుంచారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో షేక్.. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు పోలీసులు గమనించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే అతనిని దగ్గరలోని బీఎస్ఏ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
