ఓ ట్రాన్స్ జెండర్ ని అతను మనసారా ప్రేమించాడు. పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆనందంగా జీవితం సాగిస్తూ వచ్చారు. అయితే.. అనుకోకుండా సదరు వ్యక్తి ని అనుమానం అనే పెనుభూతం ఆవహించింది. అంతే... భార్యపై  ఈ విషయంలో రోజూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో భార్యను అతి కిరాతకంగా హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలోని తిమ్మాపూర్ ప్రాంతానికి చెందిన గ్యానేందర్ శుక్లా(24) అనే యువకుడు ఓ ట్రాన్స్ జెండర్ యువతిని ప్రేమించాడు. ఈ విషయాన్ని అతని తల్లిదండ్రులకు తెలియజేయగా.. వారు నిరాకరించారు. దీంతో.. పెద్దలను ఎదురించి మరీ... 2019 మార్చి 13న తాను ప్రేమించిన ట్రాన్స్ జెండర్ మెడలో మూడుముళ్లు వేశాడు.

కాగా.. వారి ప్రేమను సదరు యువతి తండ్రి మనస్ఫూర్తిగా అంగీకరించారు. దీంతో.. వారికి తన ఫ్లాట్ లోనే ఉండమని కూడా చెప్పాడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా వారి జీవితాన్ని సాగించేవారు. అనుకోకుండా వారి మధ్య గొడవలు రావడం మొదలయ్యాయి. మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నావంటూ.. శుక్లా తన భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలో శనివారం కిచెన్ లో ఉన్న చాకు తీసుకోని భార్య మెడను కోసేశాడు. రక్తం రావడంతో.. భార్య చనిపోయిందని నిర్థారించుకోని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే.. అతను వెళ్లి తర్వాత ఆమె ప్రాణాలతో పోరాడుతూ తన పరిస్థితిని వీడియో ద్వారా తండ్రికి తెలియజేసింది. అంతేకాకుండా ఇరుగువారిని అతి కష్టం మీద అలర్ట్ చేసింది. దీంతో.. వారు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.