కర్ణాటకలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జ్యోతిష్కుడి మాటలు నమ్మిన ఓ వ్యక్తి భార్య, బిడ్డను చిత్ర హింసలకు గురిచేసి,  ఇంట్లోనుంచి గెంటేశాడు. 

బెంగళూరు : సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న నేటి కాలంలో కూడా కొందరు మూఢనమ్మకాలను వదలడం లేదు. జ్యోతిష్కుడి మాటలు నమ్మి.. చెడు జరుగుతుందని విశ్వసించిన ఓ వ్యక్తి.. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను ఇంట్లో నుంచి బయటకు పంపించిన దారుణ సంఘటన చెన్న పట్టణ పరిధిలోని మంజునాథ్ లేఅవుట్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవీన్ (35), శృతికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రుత్విక్ (2) అనే కుమారుడు ఉన్నాడు.

ఆ చిన్నారి పుట్టిన నక్షత్రం వల్ల బిడ్డకు.. ఆ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి వల్ల నీకు కీడు జరుగుతుందని జ్యోతిష్కుడు చెప్పడంతో ఆ మాటలు నమ్మిన నవీన్ భార్య బిడ్డపై నిత్యం దాడి చేసి హింసించేవాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని లేదంటే పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెడతాం అని బెదిరించడంతో... శృతి తన బిడ్డను తీసుకొని ఇంట్లోంచి బయటకు వచ్చి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, ఆటో ఢీ, ఏడుగురు మహిళలు మృతి...

ఇదిలా ఉండగా, ఇలా మూఢనమ్మకంతో కన్నకూతురినే కడతేర్చిన ఘటన జూన్ లో నెల్లూరులో కలకలం రేపింది. తమ కుటుంబానికి ఏదో చెడు చుట్టుకుంటుందని... అది పోవాలంటే పూజలు చేయాలి.. అనుకున్న ఓ తండ్రి.. తన కన్న కూతురి ప్రాణాలకు ముప్పు తెచ్చాడు. ఒంటిపై పసుపు నీళ్ళు పోసి, నోటి నిండా కుంకుమ పోసి ఊపిరాడకుండా చేశాడు. దాంతో ఆ బాలిక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని వీరారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. తండ్రి చేసిన వింత పూజలతో ఆస్పత్రి పాలైన పునర్విక మూడేళ్ల పసిప్రాయంలోనే మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. 

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పేరారెడ్డిపల్లికి చెందిన పునర్విక నోట్లో ఆమె తండ్రి వేణుగోపాల్ పూజల్లో భాగంగా కుంకుమ కుక్కాడు. దాంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను చికిత్స కోసం చెన్నై తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ఆత్మకూరు ఎస్ఐ శివ శంకర్ రావు గురువారం చిన్నారి నాన్నమ్మ దొరసానమ్మను, ఇతర కుటుంబసభ్యులను విచారించగా మరిన్ని వివరాలు తెలిశాయి. వేణుగోపాల్ భార్య యామిని తన ఇద్దరు పిల్లలతో కలిసి అనుసముద్రంపేట మండలం కుప్పురుపాడులోని పుట్టింటికి వెళ్ళింది.

తెల్లారి అత్తారింటికి వెళ్ళిన వేణుగోపాల్ తన ఇద్దరు కుమార్తెలు పూర్విక, పునర్వికలను వెంటపెట్టుకుని సొంతూరు పేరారెడ్డిపల్లికి వచ్చాడు. ఆ మరుసటి ఉదయం పిల్లలకు కర్పూరం దృష్టి తీయించి, ముఖాన పెద్ద బొట్టు పెట్టుకుని వింత పూజలు చేశాడు. పూర్వికను గదిలో నుండి బయటకు పంపాడు. పునర్వికను గదిలోనే ఉంచి ఆమె నోట్లో కుంకుమ కుక్కాడు. ఈ వింత చేష్టలు దగ్గరుండి చూస్తున్నా వేణుగోపాల్ తల్లి దొరసానమ్మ అతడిని వారించలేదు. రెండు గంటల పాటు ఈ తంతు కొనసాగింది. తర్వాత పూర్వికను వెంట బెట్టుకొని దొరసానమ్మ వీధిలోకి వచ్చింది.

అయితే, కర్పూరం తో దిష్టి తీయడం.. పెద్ద బొట్టుతో పూజలు ఇవన్నీ.. చూస్తున్న స్థానిక నిలదీయడంతో లోపల జరుగుతున్న పూజతంతును ఆమె వివరించింది. దీంతో వెంటనే స్థానికులు ఇంటి తలుపులు తీయించారు. అయితే అప్పటికే పునర్విక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ విషయం తెలిసి బాలిక తల్లి యామిని వెంటనే పుట్టింటి నుంచి వచ్చింది. అపస్మారక స్థితిలో ఉన్న తన కుమార్తె ను ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. బాలిక తండ్రి వేణుగోపాల్ ను పోలీసులు విచారిస్తున్నారు.