కర్ణాటకలో విషాద ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి ఓ ట్రక్కు, ఆటో ఢీ కొన్న ఘటనలో ఏడుగురు మహిళలు మృతి చెందారు.
కర్ణాటక : కర్ణాటకలోని బీదర్‌లోని ఓ గ్రామంలో శుక్రవారం అర్థరాత్రి ట్రక్కు, ఆటో రిక్షా ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. గాయపడిన 11 మందిలో రెండు వాహనాల డ్రైవర్లు ఉన్నారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మహిళలు అందరూ కూలీ పనులు చేసుకునేవారే. పని ముగించుకుని ఆటో రిక్షాలో ఇంటికి తిరిగి వస్తుండగా బీదర్‌లోని బేమలఖేడా ప్రభుత్వ పాఠశాల సమీపంలో ట్రక్కు ఢీకొట్టింది.
చనిపోయిన మహిళలను పార్వతి (40), ప్రభావతి (36), గుండమ్మ (60), యాదమ్మ (40), జగ్గమ్మ (34), ఈశ్వరమ్మ (55), రుక్మిణి బాయి (60)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
