గుజరాత్ కోర్టు మైనర్ బాలిక హత్య కేసులో దోషికి మరణ శిక్ష విధించింది. తనను ప్రేమించడం లేదనే కోపంతో ఓ మైనర్ బాలికను 34 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఇది అరుదుల్లోకెల్లా అరుదైన కేసుగా కోర్టు పేర్కొంది. 

న్యూఢిల్లీ: గుజరాత్‌లో మైనర్ బాలికను ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. తన ప్రేమను అంగీకరించడం లేదని ఆ మైనర్‌ను 34 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ కేసును రాజ్‌కోట్‌లోని ఓ కోర్టు విచారించి అరుదుల్లోకెల్లా అరుదైన కేసుగా పేర్కొంది. కేసులోని దోషికి మరణ శిక్ష విధించింది.

ఈ ఘటన 2021లో జరిగింది. మర్డర్ కేసులో నిందితుడైన జయేశ్ సర్వయ (26) మైనర్ బాలికను దారుణంగా చంపేశాడు. జెట్‌పుర్ తాలుకాలోని జెతల్సార్ గ్రామానికి చెందిన జయేశ్ సర్వయ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను కొన్ని నెలలుగా వేధించాడు. ఆ బాలికను ప్రేమించాలని వేధించాడు. 2021 మార్చి 16వ తేదీన జయేశ్ సర్వయ మైనర్ బాలిక ఇంటికి వెళ్లాడు. తనను ప్రేమించాలని డిమాండ్ చేశాడు. కానీ, జయేశ్ సర్వయ ప్రతిపాదనను ఆ బాలిక తిరస్కరించింది. దీంతో కత్తి తీసి ఆమె పై దాడి చేశాడు.

ఆ బాలిక పారిపోయే ప్రయత్నం చేసింది. కానీ, ఆమెను దొరికించుకుని 34 సార్లు కత్తితో పొడిచేశాడు. ఇంతలో ఆ బాలిక సోదరుడు అక్కడికి వచ్చాడు. జయేశ్ సర్వయను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అతడిపైనా జయేశ్ సర్వయ దాడి చేశాడు. 

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌తో కొడుకు ఫొటోలపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కామెంట్ ఇదే.. ‘ఆయనకు 18 ఏళ్లు’

ఈ ఘటన స్థానికుల్లో కలకలం రేపింది. చాలా మందిని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. జయేశ్ సర్వయను ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

ఈ కేసుపై రాజ్‌కోట్ కోర్టు విచారించి తీర్పు వెలువరించింది. ఈ ఘటన అరుదుల్లోకెల్లా అరుదైన కేసుగా పేర్కొంది. దోషికి మరణ శిక్ష విధించింది. రూ. 5 వేల జరిమానా విధించింది. ఈ ఘటన అక్కడి కమ్యూనిటీ మొత్తాన్ని కదిలించిందని తెలిపింది. అందుకే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నట్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జనక్ పటేల్ వివరించారు.

దీనిపై అప్పీల్ చేసుకోవడానికి దోషికి ఒక నెల గడువు ఇచ్చింది.