దారుణం... కుక్కను పొడిచి చంపిన వ్యక్తి.. యజమానితో వాకింగ్ వెడుతుండగా ఘటన..
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఆడ పిట్‌బుల్‌ను పదునైన ఆయుధంతో పొడిచి చంపారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 429, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో అమానుషఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి యజమానితో కలిసి వెడుతున్న ఆడ పిట్‌బుల్‌ను పదునైన ఆయుధంతో పొడిచి చంపాడు. గురువారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. ఆ వ్యక్తి దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో కుక్క చనిపోయింది. తన యజమానితో కలిసి నడుచుకుంటూ వెళుతున్న ఆడ పిట్‌బుల్‌పై ఓ వ్యక్తి వెనకనుంచి పదునైన ఆయుధంతో దాడి చేశాడు. చనిపోయిన పెంపుడు కుక్క యజమాని.. దీనికి కారణమై నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
వెంటనే పోలీసులు కుక్క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 429, 506 కింద కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. సంఘటనను వివరిస్తూ, నితిన్ పాండే మాట్లాడుతూ, తాను ఉదయం తన ఆడ కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లానని, రవి కుమార్ అనే వ్యక్తి పెంపుడు జంతువుపై వెనుక నుండి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిందని తెలిపాడు.
పోలీసుల బూట్ల కింద నలిగి 4 రోజుల నవజాత శిశువు మృతి.. దర్యాప్తుకు ఆదేశించిన ముఖ్యమంత్రి..
యజమాని వెంటనే కుక్కను వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తరలించగా, తీవ్ర గాయం కారణంగా అది చనిపోయిందని తెలిపాడు. కుక్క యజమాని నిందితులపై చార్తావాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యతేంద్ర నగర్ తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా చార్తావాల్ పోలీస్ స్టేషన్‌లో అభియోగాలు నమోదు చేసి.. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, మూగజీవం పట్ల ఓ వ్యక్తి అమానుషంగా వ్యవహరించిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో శనివారం ఇస్మాయిల్ అనే వ్యక్తి తన మోటార్ సైకిల్ కి ఓ కుక్కను కట్టి రెండున్నర కిలోమీటర్ల మేర ఈడ్చుకువెళ్లాడు. ఈ అమానుష ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. కాగా, ఇస్మాయిల్ తన బండికి కుక్కను కట్టి విజయనగర పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప్ విహార్ ఔట్ పోస్టు నుంచి వెళుతున్నాడు. అవుట్ పోస్ట్ దగ్గరికి రాగానే స్థానికులు అతడిని గమనించి.. ఆపమని కేకలు వేశారు. అతను వినకపోవడంతో టూ వీలర్ మీద వెంటపడ్డారు. వెంబడించి ఆపారు.
మరికొందరు పీపుల్స్ ఫర్ యానిమల్స్ సభ్యులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని మీద జంతువులను హింసిస్తున్నాడన్న కేసు నమోదు చేశారు. అయితే ఇలా ఎందుకు చేసావు అని ఇస్మాయిల్ ను అడగగా.. ఆ కుక్క చాలా మందిని కరిచిందని తెలిపాడు. అందుకే… దాన్ని తమ ప్రాంతానికి దూరంగా వదిలేయడానికి తీసుకు వెళుతున్నానని పోలీసులకు ఇస్మాయిల్ తెలిపాడు.