మహారాష్ట్రలో ఓ వ్యక్తి ఇంట్లోనే నకిలీ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నాడు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి నకిలీ నోట్లను ముద్రించడం నేర్చుకున్నాడు. ఫేక్ కరెన్సీ ప్రింట్ చేసి వాటిని మార్కెట్‌లోకి పంప్ చేస్తున్నాడు. నకిలీ నోట్లను ప్రింట్ చేస్తుండగా నిందితుడిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

ముంబయి: మహారాష్ట్రలో ఓ వ్యక్తి ఇంట్లోనే నకిలీ నోట్ల ప్రింటింగ్ యంత్రం పెట్టుకున్నాడు. నకిలీ నోట్లను ఎలా ప్రింట్ చేయాలో యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాడు. ఆ తర్వాత నకిలీ నోట్లను ప్రింట్ చేస్తూ మార్కెట్‌లో అమ్ముకుంటున్నాడు. రూ. 1.50 లక్షలకు రూ. 50 వేల ఫీజుతో వాటిని మార్కెట్‌లోకి పంప్ చేస్తున్నాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పోలీసుల వరకు వెళ్లింది. విషయం తెలియగానే పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి నిందితుడిని అరెస్టు చేశారు.

మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో కుసుంబ గ్రామంలో ఓ వ్యక్తి చట్ట వ్యతిరేక పనులకు పూనుకున్నాడు. అతను ఇంటిలో నకిలీ నోట్లను ప్రింట్ చేస్తున్నాడనే విషయం గెలియగానే ఎంఐడీసీ పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే ఒక టీమ్‌గా ఏర్పడి ఆ వ్యక్తి నివాసంపై రైడ్ చేసింది. గురువారం ఆ వ్యక్తి నకిలీ నోట్లను ప్రింట్ చేస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

Also Read: లోదుస్తుల మోడలింగ్ చేయకుండా మహిళలపై నిషేధం.. బ్రాలు ధరిస్తున్న పురుషులు.. ‘వారికంటే వీరే బెటర్’

దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వ్యక్తి రూ. 1.50 లక్షల నకిలీ నోట్లను రూ. 50 వేల ఫీజుతో అమ్ముకునేవాడని తెలిసింది. యూట్యూబ్‌లో వీడియోలు చూసి నకిలీ నోట్లను ముద్రించడాన్ని నిందితుడు నేర్చుకున్నాడని జల్గావ్ ఎస్పీ ఎం రాజ్ కుమార్ తెలిపారు. ఒక్కడే ఈ పని మొత్తంగా చేస్తున్నట్టు భావించడం లేదని, మరికొందరు కలిసి ఈ నకిలీ నోట్లను ముద్రించే పని చేస్తున్నారని తాము అనుమానిస్తున్నట్టు వివరించారు. నిందితుడిని అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచామని, మార్చి 9వ తేదీ వరకు కోర్టు ఆదేశాలతో పోలీసు కస్టడీలోకి తీసుకున్నామని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నదని వివరించారు.