Asianet News TeluguAsianet News Telugu

చికెన్ వింగ్స్ ఆర్డర్ చేస్తే.. ఎముకలు, లెటర్.. దాంట్లో ఉన్న విషయం చూసి కంగుతిన్న కస్టమర్..

ఓ కస్టమర్ ఎంతో ఆకలితో చికెన్ వింగ్స్ ఆర్డర్ చేశాడు. కానీ ప్యాకెట్ విప్పి చూస్తే.. దాంట్లో తినగా మిగిలిన బోన్స్, ఓ లెటర్ మాత్రమే ఉన్నాయి.

Man orders chicken wings, gets bones and a note instead in newdelhi
Author
First Published Sep 9, 2022, 9:13 AM IST

న్యూఢిల్లీ : ఫుడ్ డెలివరీ సేవలు.. ఎంతో మందికి ఉపయోగకరంగా ఉన్నాయి. ఇవి అందుబాటులోకి వచ్చిన తర్వాత జీవితాలు మరింత సౌకర్యవంతంగా మారాయి. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎక్కడున్నా, ఎప్పుడైనా, అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా.. కావలసిన ఆహారాన్ని హాయిగా ఎక్కడికైనా తెప్పించుకునే వీలు చిక్కింది. దీంతో ఇది చాలాసార్లు మన ఫుడ్ క్రేవింగ్ ను, ఆకలిని క్షణాల్లో చల్లారుస్తోంది. అయితే, దీంట్లో కొన్నిసార్లు అపశృతులు సహజం.. మరికొన్నిసార్లు ఆర్డర్ చేసిన దానికి బదులుగా మరోటి రావడం వంటివి కూడా జరిగిన ఘటన వెలుగులోకి వస్తాయి. 

అయితే ఢిల్లీలో జరిగిన ఈ ఘటన మాత్రం పూర్తిగా భిన్నమైంది. ఓ వ్యక్తి డెలివరీ బాయ్ తెచ్చిన పాకెట్ ను ఆవురావురుమంటూ విప్పిన డామియెన్ శాండర్స్ కు వింత అనుభవం ఎదురయింది. ప్యాక్ విప్పి షాకైన అతడు తన అనుభవాన్ని అందరితో పంచుకోవాలని భావించి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఆ పోస్ట్ ప్రకారం డామియెన్ ఓ రెస్టారెంట్ నుంచి చికెన్ వింగ్స్, కూల్ డ్రింక్ ఆర్డర్ చేశాడు. కాసేపటి తర్వాత డెలివరీ బాయ్ వచ్చి ప్యాకెట్ అందించి వెళ్ళాడు. అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న డామియెన్ ప్యాకెట్ విప్పి చూసి నిర్ఘాంతపోయాడు.  

హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. వచ్చిన ప్యాక్ చూసి షాక్ అయిన గురుగ్రామ్ వాసి..
అందులో అతను ఆర్డర్ చేసిన చికెన్ వింగ్స్ కు బదులుగా మొత్తం తినగా మిగిలిన బొక్కలు కనిపించడంతో విస్తుపోయాడు. 

అక్కడితో అయిపోలేదు అందులో ఓ లెటర్ కూడా ఉండడంతో.. ఆశ్చర్యంగా దాన్ని విప్పి చదివాడు. అందులో.. ‘తనకు బాగా ఆకలి వేయడంతో.. వేరే దారి లేక ప్యాకెట్ విప్పి తినేసానని, తనను క్షమించాలని’ డెలివరీ బాయ్ ఆ లేఖలో రాసుకొచ్చాడు. ‘నా కోసం మీరే డబ్బులు చెల్లించారని అనుకోమని, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని’ రాశాడు. అంతే కాదు ఆ జాబ్ ను తాను వదిలేసినట్లు కూడా అందులో పేర్కొన్నాడు ఏం చేయాలో పాలుపోని డామియెన్ దానిని వీడియో తీసి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది.

దీనిమీద నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొందరు ‘పోనీలే ఆకలేసి తిని ఉంటాడు’ అని కామెంట్ చేస్తే..,  ‘తిన్నాడు సరే, ఎముకల ఇవ్వడం ఏమిటని’.. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూల్ డ్రింక్ బాటిల్ మాత్రం ముట్టకపోవడంపై ‘కనీసం ఇదైనా తెచ్చాడు నయం’.. అని జోకులు వేస్తున్నారు. కాగా, 2018లో  జొమాటో డెలివరీ బాయ్ ఒకరు కస్టమర్ ఫుడ్ తినేశాడు. ఆ తర్వాత అతడిని కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే, ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది. సమయంతో పని లేకుండా కొద్దిపాటి వేతనం కోసం పని చేస్తుంటే ఇలా తీసేస్తారా? అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. డెలివరీ బాయ్స్ పై చాలా ఒత్తిడి ఉంటుంది. సమయానికి డెలివరీ చేయాలనే తొందర్లో కొన్నిసార్లు ప్రమాదంలో పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios