ఫరీదాబాద్‌లో 19 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి దారుణంగా కొట్టి చంపేశాడు. నిందితుడిని డబువాలో నివసించే మహేంద్రగా గుర్తించారు. అతడికి అంతకుముందేపెళ్లయిందని పోలీసులు తెలిపారు.
గురుగ్రామ్ : ఫరీదాబాద్‌లోని ముజేసర్ ప్రాంతంలో 19 ఏళ్ల యువతిపై మోజుపడ్డ ఓ వ్యక్తి ఆమె నిరాకరించడంతో ఆమెను దారుణంగా కొట్టి చంపినట్లు గుర్గావ్‌లోని పోలీసులు గురువారం తెలిపారు. బుధవారం రాత్రి నిందితులు ఆ మహిళను కొట్టి రోడ్డు పక్కన వదిలేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది.
చనిపోయే ముందు, ఆ మహిళ తన సోదరుడికి తన మీద దాడి చేసిన వ్యక్తి పేరు చెప్పింది. అతనిమీద ముజేసర్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చనిపోయిన ఆ యువతిని రోష్నిగా గుర్తించారు. ఆమె డబువా చౌక్ సమీపంలోని తన బావగారి ఇంట్లో ఉండేది. నిందితుడిని డబువా నివాసి మహేంద్రగా గుర్తించారు. అతడికి అంతకుముందే పెళ్లయిందని పోలీసులు తెలిపారు. రోష్ని వర్ల్‌పూల్ చౌక్ సమీపంలోని ఫ్యాక్టరీలో పనిచేసేదని, ఎప్పటిలాగే బుధవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పనికి వెళ్లిందని రోష్ని బావ అయిన రాజు తెలిపారు.
యువతిపై గ్యాంగ్ రేప్ లో.. అండమాన్ మాజీ సీఎస్ జితేంద్ర నరైన్ అరెస్ట్..
అయితే ఆ రోజు అర్థరాత్రి వరకు ఆమె ఇంటికి తిరిగి రాలేదని, ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉందని తెలిపారు. "దీంతో మేం కంగారు పడ్డాం. ఆమె కోసం వెతకడం ప్రారంభించాం. కానీ, ఈ రోజు ఉదయం 5.30 గంటలకు రోష్ని సోదరుడి ఫోన్‌కు తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది. రోడ్డుపై గాయపడిన స్థితిలో ఒక మహిళ పడి ఉందని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు. ఆమె తనను మా నెంబర్ చెప్పి, ఫోన్ చేయమని కోరిందని అతను చెప్పాడు" అన్నాడు రాజు.
విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. రోడ్డు పక్కన రక్తపు మడుగులో పడి ఉన్న రోష్ణి కనిపించింది. మహేంద్ర తనతో ఇలా చేశాడని ఆమె అతని సోదరుడు కిషన్‌తో చెప్పిందని రాజు తెలిపారు. "రాత్రి సమయంలో ఫ్యాక్టరీ బయట నుంచి మహేంద్ర తనను బలవంతంగా తనతో తీసుకెళ్లి కర్రతో కొట్టాడని ఆమె చెప్పింది. గాయాలతో అలాగే రోడ్డుపై రాత్రంతా పడి ఉంది. మేము ఆమెను బికె ఆసుపత్రికి తరలించాం., అక్కడ చికిత్స పొందుతూ మరణించింది" అని రోష్ని సోదరుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
"నిందితుడు పరారీలో ఉన్నాడు. అతనిని పట్టుకోవడానికి తీవ్రంగా గాలిస్తున్నాం. అతన్ని త్వరలో అరెస్టు చేస్తాం" అని ముజేసర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ కబూల్ సింగ్ తెలిపారు.
