ఓ వ్యక్తి మహిళను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీనికి ఆమె తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆమెను గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.
న్యూఢిల్లీ : ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బట్టలు ఆరేయడానికి వెళ్లిన వివాహితను గొంతుకోసి హతమార్చాడో దుండగుడు. తనతో సంబంధం పెట్టుకోవాలని, కోరిక తీర్చాలని ఓ వ్యక్తి మహిళను లైంగిక వేధింపులకు గురిచేశాడు. దీనికి ఆ యువతి నిరాకరించింది. ఎన్నిసార్లు వేధించినా ఆమె లొంగలేదు. దీంతో ఆ యువతిని గొంతుకోసి అతి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి ఆ యువతి ఇంటిపక్కనే ఉంటాడని తెలిపారు. తూర్పు ఢిల్లీలోని గాంధీ నగర్‌లో బుధవారం అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా వాసి మాన్ సింగ్‌గా గుర్తించినట్లు వారు తెలిపారు.
ఈ హత్య జూలై 1వ తేదీన జరిగింది. రఘుబ్రాపుర-IIలోని ఓ ఇంటి మెట్ల మీద 22 ఏళ్ల యువతి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జీటీబీ ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సింగ్ సమీపంలోని రెడీమేడ్ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. సంఘటన జరిగిన రోజు, అతను ఆరోజు తాను ఇంట్లో నుంచే పనిచేస్తానని చెప్పి ఫ్యాక్టరీ నుంచి ఒక కత్తెరను తీసుకున్నాడు. ఆ తరువాత మిగతా వారంతా కంపెనీ లోపలికి వెళ్లిపోగానే నిందితుడు బీరు తాగాడు. ఆ తరువాత పక్కింటి యువతి బిల్డింగ్ మీదికి వెళ్లడం గమనించాడు.
విషం తీసుకుని యువ రెజ్లర్ మృతి.. అదే కారణమని అనుమానం
ఆమె పైన బట్టలు ఆరేసి వస్తుండగా అటకాయించాడు. మళ్లీ తన కోరిక తీర్చాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించింది. తన భర్తకు చెబుతానని బెదిరించింది. దీంతో అతను కోపంతో ఆమె మీద కత్తెరతో దాడి చేశాడు. దారుణంగా గొంతు కోశాడు. ఈ హాఠాత్పరిణామానికి ఆమె అక్కడిక్కడే పడి మృతి చెందింది. మత్తు దిగి విషయం అర్థమయిన సింగ్ అక్కడినుంచి పారిపోయాడు.
"ఆదివారం, GTB ఆసుపత్రిలో ఆ యువతి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. పదునైన ఆయుధంతో బాధితురాలి గొంతు కోసినట్లు రిపోర్టులో తేలింది. ఆ తర్వాత ఈ మృతి గాంధీ నగర్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (షహదర) ఆర్ సత్యసుందరం అన్నారు.
మహిళలు, యువతులు, చిన్నారులను లైంగింకగా వేధించడం, నిరాకరిస్తే అంతమొందించడం మామూలుగా మారిపోయింది. వారి మీద అత్యాచారానికి పాల్పడి హత్య చేయడం..ఘటనలు కలకలం రేపుతున్నాయి. వీటి మీద ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, నిందితులకు కఠిన శిక్షలు విధిస్తున్నా నేరాలు ఆగడం లేదు. ఇది భయాందోళనలు కలిగిస్తున్న విషయం. దేశవ్యాప్తంగా ప్రతీ రోజూ ఏదో ఒక చోట, ఏదో ఒక మూల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మహిళలు, చిన్నారుల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతూనే ఉంది.
