నవంబరు 23, 24, 25 తేదీల్లో హరియాణాలోని గురుగ్రాంలో జరిగిన వరుస హత్యలు ఓ సైకో కిల్లర్ పని అని తేలింది. ఈ నేరంలో 22యేళల ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తానేంటో నిరూపించుకోవడానికే హత్యలు చేశానని చెప్పి షాక్ కి గురి చేశాడు. 

చిన్నప్పటి నుంచి అందరూ.. నువ్వు చేతకాని వాడివి. బలహీనుడివి అనే వారు. వాళ్లెందుకు అలా మాట్లాడుతున్నారో నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడే ఈ ప్రపంచానికి నేనేంటో చూపించాలని నిర్ణయించుకున్నా. అందుకే ఈ హత్యలు చేశా - అంటూ 22 ఏళ్ల రాజీ అనే యువకుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. 

స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో బిహార్‌కు చెందిన మహ్మద్‌ రాజీ(22) ఈ నేరాలకు పాల్పడ్డట్టు గుర్తించారు. ఐఎఫ్‌ఎఫ్‌సీఓ చౌక్‌ వద్ద గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఒంటరిగా ఉన్న వ్యక్తులతో మాటలు కలిపి, వారికి మద్యం తాగించి మచ్చిక చేసుకునేవాడినని, ఆ తర్వాత పదునైన ఆయుధంతో దాడి చేసి వారిని హతమార్చినట్లు విచారణలో రాజీ వెల్లడించాడు. 

నవంబరు 23న గురగ్రాం లీజర్‌వ్యాలీ పార్క్‌, ఆ మరుసటి రోజు సెక్టార్‌ 40లో ఓ సెక్యూరిటీ గార్డును, ఆ తర్వాతి రోజు రాకేశ్‌ కుమార్‌ అనే వ్యక్తిని చంపేసినట్లు పేర్కొన్నాడు. రాకేశ్‌ కుమార్‌ను చంపిన తర్వాత అతడి మొండెం నుంచి తలను వేరుచేశానన్న రాజీ, పోలీసులకు ఘటనాస్థలికి తీసుకువెళ్లగా తలను స్వాధీనం చేసుకున్నారు. 

ఈ విషయం గురించి రాజీ మాట్లాడుతూ.. రాకేశ్‌ గొంతు కోసిన తర్వాత తనను అలా వదిలేయడం ఇష్టంలేక కన్హాయ్‌ గ్రామంలో తలను పడేసినట్లు చెప్పుకొచ్చాడు. కాగా సుమారు 250-300 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన తర్వాత నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

ఈ మూడు హత్యలతో పాటు ఢిల్లీలో ఇటీవల జరిగిన 10 హత్యలతో కూడా రాజీకి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. చిన్ననాటి చేదు అనుభవాల వల్ల ఆత్మన్యూనతకు లోనై ఈ నేరాలకు పాల్పడినట్లు హంతకుడు తెలిపాడని పేర్కొన్నారు.