వారికి అండగా నిలిచేందుకు ఇతర రాష్ట్రాల ప్రజలు, ఉద్యోగులు, సెలబ్రెటీలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. కాగా.. ఇలాంటి సమయంలో ఓ చెత్త ట్వీట్ చేసి ఓ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోయాడు.

భారీ వర్షాలు కేరళను అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు భారీ వరదలకు అల్లాడిపోయాయి. కనీసం తిండ్రి, నీరు, నిద్ర లేక.. అష్టకష్టాలు పడుతున్నారు. వారికి అండగా నిలిచేందుకు ఇతర రాష్ట్రాల ప్రజలు, ఉద్యోగులు, సెలబ్రెటీలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. కాగా.. ఇలాంటి సమయంలో ఓ చెత్త ట్వీట్ చేసి ఓ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోయాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే...కేరళకు చెందిన రాహుల్‌ చెరు పళయట్టు ఒమన్‌లోని లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. కేరళలో వరదల నేపథ్యంలో బాధితులకు అండగా సోషల్‌మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘శానిటరీ నాప్‌కీన్లు’ కూడా అందిస్తే బాగుంటుంది అని ఓ నెటిజన్‌ పోస్టు చేశారు. ఈ పోస్టుకు స్పందించిన రాహుల్‌.. ‘కండోమ్‌లు కూడా అవసరమే’ అంటూ అసభ్యంగా పోస్టు చేశారు.

రాహుల్‌ పోస్టుపై లులు గ్రూప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని వెంటనే విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ‘రాహుల్‌ సోషల్‌మీడియాలో చేసిన అసభ్య కామెంట్ల నేపథ్యంలో అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం’ అని కంపెనీ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో స్పందించిన రాహుల్‌.. ఫేస్‌బుక్‌ ద్వారా క్షమాపణలు తెలిపారు. ‘ఆ సమయంలో నేను మద్యం సేవించి ఉన్నాను. ఏం మాట్లాడుతున్నానో చూసుకోలేదు. జరిగిందానికి నిజంగా క్షమాపణలు తెలియజేస్తున్నా’ అని వీడియో సందేశం ద్వారా తెలిపాడు.

అయితే రాహుల్‌ క్షమాపణలను కంపెనీ అంగీకరించలేదు. ‘ఇలాంటి ఘటనలను మేం సమర్థించబోం. మా సంస్థ మానవ సంబంధాలకు, నైతిక విలువలకు కట్టుబడి ఉంటుంది. రాహుల్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం’ అని కంపెనీ చీఫ్‌ కమ్యూనికేషన్ ఆఫిసర్‌ స్పష్టం చేశారు.