ఆకలేయడంతో ఏమైనా తిందామని ప్రయత్నించిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి అక్షరాల రూ.4 లక్షలు పొగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని గొమ్తినగర్‌కు చెందిన ఓ యువకుడికి బాగా ఆకలి వేయడంతో తన మొబైల్ ఫోన్ తీసి ఓ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేశాడు.

కొద్దిసేపటి తర్వాత ఫుడ్ క్వాలిటీ సరిగా లేదనుకొని ఆర్డర్‌ను రద్దు చేశాడు. ఈ నేపథ్యంలో అతను తను చెల్లించిన డబ్బులను తిరిగి పొందడం కోసం ఆన్‌లైన్‌లోనే కస్టమర్ కేర్ నెంబర్‌ను వెతికి పట్టుకుని ఫోన్ చేశాడు.

అటువైపు నుంచి మాట్లాడిన వ్యక్తి డబ్బులు రిఫండ్ చేయాలంటే తాము పంపిన లింక్‌ను క్లిక్ చేసి మరో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించాడు. దీంతో సదరు యువకుడు అతను చెప్పినట్లే చేశాడు.

Also Read;పరాయి దేశం నుంచి వచ్చి.. వృద్ధ దంపతులను నమ్మించి.. ఘరానా మోసం

కొత్త యాప్‌లో తన పేరు, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్‌ తదితర వివరాలను నమోదు చేశాడు. ఈ క్రమంలో ఓ ఓటీపీ  రాగా.. అది ఎంటర్ చేయగానే డబ్బులు రిఫండ్ అవుతాయని చెప్పాడు. దీనిని నమ్మిన సదరు యువకుడు ఓటీపీ నెంబర్ పొందుపరిచాడు.

అంతే క్షణాల్లో అతని అకౌంట్‌లో ఉన్న రూ.4 లక్షలు విత్ డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఖంగుతిన్న బాధితుడు మరోసారి కస్టమర్ కేర్‌కు కాల్ చేయగా.. ఎటువంటి స్పందన రాలేదు. మోసపోయానని తెలుసుకున్న ఆ యువకుడు స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. 

మరో ఘటనలో బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి చొరపడ్డారు. కూలి పనులు చేసుకోవడానికి వచ్చామంటూ అందరినీ నమ్మించారు. కేరళలో ఒంటరిగా నివసిస్తున్న దంపతులపై కన్నేశాడు. ఆ వృద్ధ దంపతులను హత్య చేసి ఆభరణాలతో పరారయ్యారు. తీరా విశాఖలో పోలీసులకు చిక్కారు.

ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..  బంగ్లాదేశ్ కి చెందని జువెల్ హుస్సేన్(21), లాబ్లూ హుస్సేన్(33) పది రోజుల క్రితం మన దేశంలోకి ప్రవేశించారు.  కేరళలోని ఓ గుడి నిర్మాణ పనుల్లో కూలీలుగా రెండు రోజులు పనిచేశారు. ఆ తర్వాత మరోచోట గడ్డికోసే పనికి మారారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో నివసిస్తున్న వృద్ధ దంపతులతో పరిచయం పెంచుకున్నారు.
 
వారి ఒంటిపై బంగారు ఆభరణాలు గమనించి, ఇంట్లో డబ్బు ఎక్కువగా ఉండొచ్చని భావించారు. ఈ నెల 11న వృద్ధ దంపతుల ఇంట్లోకి చొరబడి వారిపై ఇనుపరాడ్లతో దాడిచేసి హతమార్చారు. సొత్తు సర్దుకుని 12న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. అయితే అక్కడి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేరళ పోలీసుల నుంచి మంగళవారం విశాఖపట్నం ఆర్పీఎఫ్‌ పోలీసులకు సమాచారం వచ్చింది.

Also Read:video news : దశాబ్దాల కిందటి గుడిని కూల్చేశారు...

అనుమానితుల ఫొటోలు పంపడంతో ఈ మేరకు విశాఖ రైల్వేస్టేషన్‌లో పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించారు. తనిఖీలు చేస్తుండగా, పారిపోయేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.11 లక్షల విలువైన బంగారు ఆభరణాలుస్వాధీనం చేసుకున్నారు.