వారిద్దరూ ప్రాణ స్నేహితులు. ఎంతలా అంటే.. ఒకరి కోసం మరొకరు ప్రాణం ఇచ్చేంత. అలాంటి స్నేహితుల మధ్య ప్రేమ చిచ్చు పెట్టింది. వారిలో ఒకరు ప్రేమలో పడ్డారు. అయితే.. తాను ప్రేమించిన అమ్మాయితో తన స్నేహితుడు చనువుగా ఉండటం చూసి తట్టుకోలేకపోయాడు. కనీసం ఏం జరిగింది అని కూడా అడగకుండా.. అతి దారుణంగా హత్య చేసేశాడు.  ఈ దారుణ సంఘటన రాయగడలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కలహండి జిల్లాలోని టిట్లాఘడ్ గ్రామానికి చెందిన రామన్ బబర్తీ, దేబన్ పొడ గ్రామానికి చెందిన ఉమాకాంత కండో(25) ప్రాణ స్నేహితులు. చిన్నప్పటి నుంచి ఒకరి కోసం  ఒకరు అన్నట్లుగా పెరిగారు. కాగా.. రామన్ ఇటీవల ఓ యువతి ప్రేమలో పడ్డాడు. అనుకోకుండా.. ఆ యువతి.. ఉమాకాంతో చనువుగా ఉండటం మొదలుపెట్టింది.

అంతే.. అది రామన్ కంట పడటంతో తట్టుకోలేకపోయాడు. ఉమాకాంతను చంపేస్తే.. తన ప్రేమను కాపాడుకోవ్చని అనుకున్నాడు. ఇదే విషయాన్ని తన మరో ఇద్దరు స్నేహితులు ప్రశాంత్‌ బబర్తీ, ప్రకాష్‌ బటొలకు తెలియజేశాడు. వారంతా కలిసి పథకం ప్రకారం గత నెల 4 వ తేదీన ఉమాకాంతను రాయగడలో విందు భోజనానికి ఆహ్వానించారు.

ఆహ్వానం మేరకు రాయగడ వచ్చిన ఉమాకాంతను రామన్, స్నేహితులు జిల్లాలోని కల్యాణసింగుపూర్‌ ప్రాంతంలోని చెక్‌ డ్యామ్‌కు తీసుకువెళ్లారు. పథకం ప్రకారం ఉమాకాంతతో ఎక్కువ మద్యం తాగించి గొంతునులిమి హత్య చేశారు. అనంతరం ఉమాకాంత మృతదేహాన్ని డ్యామ్‌ సమీపంలో ఇసుక కుప్పవద్ద పాతిపెట్టి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. అయితే మే 4 వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన ఉమాకాంత ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు టిట్లాఘడ్‌ పొలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఉమాకాంత స్నేహితుడైన రామన్‌ బబర్తీ ఫోన్‌ను ట్రాక్‌ చేయడంతో విషయం బయటపడింది. రామన్‌ బబర్తీని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఉమాకాంతను హత్య చేసిన సంగతి అంగీకరించాడు. ఈ సమాచారం మేరకు చెక్‌డ్యామ్‌ వద్ద పాతిపెట్టిన మృతదేహాన్ని మేరకు కల్యాణసింగుపురం పోలీసుల సహాయంతో టిట్లాఘడ్‌ పోలీసులు వెలికితీశారు. అనంతరం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు.