బెంగుళూరు: స్మార్ట్‌పోన్‌లో మునిగిపోయి తనతో పాటు రెండేళ్ల కూతుర్ని కూడ పట్టించుకోవడం లేదనే కోపంతో ఆమెను హత్య చేశాడు భర్త. ఈ ఘటన కర్ణాటక 
కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులోని కావేరిపురాలో చోటుచేసుకొంది.

ఒడిశాలోని భద్రక్ గ్రామానికి చెందిన కైలాస్ చంద్ర బెహ్రా  బెంగళూరు నగరానికి పదేళ్ల క్రితం వలస వచ్చాడు. కైలాస్ చంద్ర ఐదేళ్ల క్రితం తమ పక్క గ్రామానికి చెందిన మాలతిని వివాహం చేసుకున్నాడు. వారికి ఓ పాప కూడ ఉంది. భార్య మాలతి నిత్యం బంధువులు, స్నేహితులతో ఫోన్ లో మాట్లాడుతూ తనతోపాటు రెండేళ్ల కూతుర్ని పట్టించుకోవడం లేదని భర్త కైలాస్ చంద్ర ఆగ్రహం వ్యక్తం చేసేవాడు.

ఫోన్ లో మాట్లాడుతూ మాలతి తరచూ ఇంటి నుంచి బయటకు వెళుతుండేది. దీంతో భార్యపై అనుమానంతో భర్త కైలాస్ చంద్ర నిత్యం ఆమెతో గొడవపడుతుండేవాడు. దీనికి తోడు తండ్రికి పంపించాలని ఇంట్లో ఉంచిన నగదు భార్య తీసుకుంది. 

ఈ విషయమై భార్య, భర్తల మధ్య బుధవారం నాడు  తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. కోపంతో భార్య చంద్ర మాలతిని కైలాస్ ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆపై భార్య మృతదేహంతో పాటు కూతుర్ని ఇంట్లోనే ఉంచి కైలాస్ చంద్ర స్వస్థలమైన ఒడిశాకు పారిపోయాడు.

ఇంట్లో చిన్నారి ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపు పగులగొట్టి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించి చిన్నారిని సదనానికి తరలించారు. అనంతరం ప్రత్యేక పోలీసులు ఓడిశాకు వెళ్లి నిందితుడైన భర్త కైలాస్ చంద్రను అరెస్టు చేశారు.