బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడనే కోపంతో ఆమె ప్రియుడిని ఓ వ్యక్తి హత్య చేశాడు. 

ఆ సంఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా బైడరహల్లిలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. భరత్ కుమార్ (31) వినుత అనే మహిళను ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 

మూడేళ్ల కింద ఉద్యోగం వెతుక్కుంటూ వినుత స్నేహితుడు శివరాజ్ బెంగళూరు నగరానికి వచ్చాడు. ఈ మధ్య శివరాజ్ తాను ప్రేమిస్తున్నానంటూ వినుతకు చెప్పాడు. మొదట ఆమె నిరాకరించింది. అయితే, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆమె చివరకు ఒప్పుకుంది. 

కాగా, వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు భరత్ గుర్తించాడు. దాంతో శివరాజ్ మీద కక్ష పెంచుకున్నాడు. అతన్ని చంపాలని ఓ నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు చెలరేగసాగాయి. దాంతో వినుత బైడరహల్లిలోనే మరో ఇంట్లో విడిగా ఉంటోంది. వారంలో రెండు సార్లు శివరాజ్ ఆమె ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. 

కాగా, బుధవారంనాడు రాత్రి 9 గంటల సమయంలో వినుత చికెన్ తీసుకుని వచ్చేందుకు బయటకు వెళ్లింది. ఆ సమయంలో భరత్ ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ తర్వాత రాత్రి 10.30 గంటలకు శివరాజ్ వచ్చాడు వినుత, శివరాజ్ భోజనం చేసి నిద్రపోయారు. తెల్లవారు జామున 3 గంటలకు వినుత వాష్ రూంకు వెళ్లింది. ఆ సమయంలో వాష్ రూంకు భరత్ తాళం వేశాడు. ఆ తర్వాత తాను తెచ్చుకున్న కత్తితో శివరాజ్ ను పొడిచి చంపేశాడు. 

పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధించాడు. భరత్ తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.