ఓ వ్యక్తి తన సోదరుడి భార్యపై ఇష్టం పెంచుకున్నాడు. ఆమెను ఆకర్షించే ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో చివరకు తన సోదరుడిని హత్య చేశాడు.

ఓ వ్యక్తి తన సోదరుడి భార్యపై ఇష్టం పెంచుకున్నాడు. ఆమెను ఆకర్షించే ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో చివరకు తన సోదరుడిని హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. మృతుడిని చత్తీస్‌గఢ్‌కు చెందిన మోహిత్ సాహుగా గుర్తించారు. వివరాలు.. మోహిత్ సాహు, అతని భార్య లక్నోలోని చిన్‌హట్‌లో నివాసం ఉంటున్నారు. మోహిత్‌ తాను నివాసం ఉంటున్న ఫ్లాట్‌లోనే అతని సోదరుడు భూపేంద్ర సాహును కూడా ఉంచుకున్నాడు. 

అయితే కొద్ది రోజులకు భూపేంద్ర సాహు ప్రవర్తనలో మార్పు వచ్చింది. తన సోదరుడి భార్యపై కన్నేశాడు. ఆమెను తనవైపుకు ఆకర్షించడానికి ప్రయత్నాలు చేశాడు. అయితే భూపేంద్ర ప్రవర్తనపై మోహిత్‌ భార్య.. మోహిత్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో మోహిత్, భూపేంద్ర మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే భూపేంద్రను మోహిత్ ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. 

దీంతో మోహిత్‌పై భూపేంద్ర కోపం పెంచుకున్నాడు. శనివారం రాత్రి మోహిత్ ఇంటికి వచ్చిన భూపేంద్ర.. అతనితో గొడవ పడ్డారు. మోహిత్‌‌పై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. మోహిత్ గొంతు కోసి హత్య చేశాడు. అయితే ఆసమయంలో మోహిత్ భార్య ఇంటి పైభాగంలో నిద్రిస్తుంది. 

ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకన్న పోలీసులు విచారణ చేపట్టారు. భూపేంద్ర‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడు నేరాన్ని అంగీకరించాడు. తన సోదరుడిని ద్వేషిస్తున్నాడని.. అందుకే అతన్ని చంపినట్లు చెప్పాడు. తన సోదరుడి భార్య తనకు, తన సోదరుడికి మధ్య చిచ్చు పెట్టిందని చెప్పాడు.

‘‘భూపేంద్రకు మృతుడి భార్య పట్ల చెడు ఉద్దేశం ఉంది. మోహిత్‌కి ఈ విషయం తెలియగానే.. భూపేంద్రతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లమని బలవంతం చేశాడు. దీనిని అవమానంగా భావించిన భూపేంద్ర.. ప్రతీకారం తీర్చుకోవడానికి మోహిత్‌ను చంపాడు’’ అని పోలీసులు తెలిపారు.