కన్న కూతురిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి అత్యంత కిరాతకంగా చంపాడు ఓ కసాయి తండ్రి. ఈ అమానుష ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. 

సూరత్ : ఇంట్లో ఉక్కుపోతగా వుండటంతో మేడపై పడుకుందామని భర్తను కోరడమే ఆమె తప్పయింది. ఇంత చిన్న విషయానికే సైకోలా మారి కన్న కూతురిని కిరాతకంగా చంపాడో కసాయి. విచక్షణ కోల్పోయిన కన్న తండ్రి కత్తితో 17 పోట్లు పొడవడంతో రక్తపుమడుగులో కుప్పకూలిన యువతి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ అమానుష ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిసిన వివరాలిలా ఉన్నాయి. బిహార్ రాష్ట్రానికి చెందిన రామానుజ్ మహదేవ్ సాహు ఉపాధి నిమిత్తం గుజరాత్ కు వలసవెళ్ళాడు. సూరత్ జిల్లా కడోదరలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కుటుంబంతో కలిసి నివాసముంటూ ఓ మిల్లులో పనిచేస్తూ పోషించుకుంటున్నాడు.

అయితే వేసవికాలం కావడంతో ఇంట్లో తీవ్ర ఉక్కపోతగా వుండటంతో మహదేవ్ ముగ్గురు కొడుకులు, కూతురు ఇబ్బందిపడ్డారు. వారి ఇబ్బందిని గ్రహించిన తల్లి రేఖాదేవి రాత్రి మేడపై పడుకుందామని భర్తను కోరింది. అందుకు అంగీకరించని మహదేవ్ భార్యపై కోప్పడగా ఇద్దరిమధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇలా భార్యాభర్తల మధ్య చిన్నగా మొదలైన గొడవ పెద్దదయ్యింది. ఈ క్రమంలోనే క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన మహదేవ్ దారుణానికి ఒడిగట్టాడు. 

Read More తండ్రిని అతి కిరాతంగా చంపిన కొడుకు.. భయంతో ఆత్మహత్య చేసుకున్న భార్య.. అసలేం జరిగిందంటే..?

భార్యతో గొడవపడి భయటకు వెళ్లిన మహదేవ్ మద్యం సేవించి ఓ కత్తి తీసుకుని ఇంటికి వచ్చాడు. కోపంగా భార్యపైకి వెళ్లి వెంటతెచ్చుకున్న కత్తితో పొడవడానికి ప్రయత్నించగా కూతురు చాంద్ కుమారి అడ్డుకుంది. దీంతో భార్యను వదిలి కూతురిపై కత్తితో దాడి చేసాడు. ఇలా కసాయి తండ్రి 17సార్లు కత్తితో పొడవడంతో తీవ్ర రక్తస్రావమై చాంద్ కుమారి అక్కడికక్కడే మృతిచెందింది. అతడిని అడ్డుకోడానికి ప్రయత్నించిన భార్యతో పాటు ముగ్గురు కొడుకులకు గాయాలయ్యాయి. 

ఈ అమానుష ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చాంద్ కుమార్ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కూతుర్ని చంపి, భార్యా పిల్లలకు గాయపర్చి పరారయిన నిందితుడి అరెస్ట్ చేసి కటకటాల్లోకి తోసారు.