హైదరాబాద్‌లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన ఢిల్లీ పోలీసులు.. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ హత్య కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న మూసా ఖురేషిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్‌లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన ఢిల్లీ పోలీసులు.. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ హత్య కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న మూసా ఖురేషిని అదుపులోకి తీసుకున్నారు. 2020లో ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ హత్య జరిగింది. ఈ కేసులో చాంద్ బాగ్‌కు చెందిన మూసా ఖురేషి నిందితుడిగా ఉన్నాడు. అయితే అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్.. హైదరాబాద్ మీర్‌పేట్‌లోని గాయత్రి నగర్‌లో అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో గాయత్రి నగర్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్న మూసా ఖరేషిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2020 ఫిబ్రవరి 25న జరిగిన అల్లర్లలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మను కూడా చాంద్ బాగ్ పులియా సమీపంలో ఓ మూక దారుణంగా చంపింది. అతని మృతదేహాన్ని నిందితులు సమీపంలోని చాంద్ బాగ్ డ్రెయిన్‌లో పడేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అప్పటి సిట్టింగ్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌తో సహా 10 మంది నిందితులను అరెస్టు చేశాం. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. పదునైన ఆయుధాలతో శర్మను 52 సార్లు పొడిచి చంపారు. ఈ కేసు విచారణలో ఖురేషీ కూడా శర్మపై దాడికి పాల్పడిన వారిలో కీలక వ్యక్తి అని తేలింది.
ఖురేషీ 2020 ఫిబ్రవరి నుంచి పరారీలో ఉన్నాడు. ఢిల్లీ కోర్టు అతన్ని ఈ కేసులో ప్రకటిత నేరస్థుడిగా ప్రకటించింది. అతనిపై ఢిల్లీ పోలీసులు రూ. 50,000 రివార్డును కూడా ప్రకటించారు. మూలాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఖురేషీ గత ఆరు నెలలుగా తెలంగాణలో నివసిస్తున్నట్లు మేము కనుగొన్నాము. అందువల్ల నిందితులను గుర్తించి పట్టుకునేందుకు స్పెషల్ సెల్ బృందాన్ని తెలంగాణకు పంపించాం. తెలంగాణలోని మీర్‌పేట్‌లోని గాయత్రీ నగర్‌లో ఉన్న ఒక నిర్దిష్ట కెమిస్ట్ షాప్‌కు నిందితులు వెళ్లేవారని కూడా తేలింది. సోమవారం ఖురేషీ కెమిస్ట్ షాప్‌లోకి వెళుతుండగా అతడిని పట్టుకున్నాం.
గతంలో కిడ్నాప్, అత్యాచారం కేసులో ఖురేషీ జైలుకు వెళ్లాడు. జైలులో, అతను బరేలీకి చెందిన ముజీబ్ అనే పేరుమోసిన నేరస్థుడిని కలిశాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఖురేషి తన మామతో కలిసి గాజీపూర్ ముర్గా మండిలో పని చేయడం ప్రారంభించాడు. అయితే తన ఖర్చుల కోసం నేరాలు చేయడం మొదలుపెట్టాడు.
