గౌహతి: తనపై ఓ ఎమ్మెల్యే రెండు దఫాలు అత్యాచారం చేశారని ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే  ఎమ్మెల్యే వద్దకు తనను తన భర్తే పంపాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అసోం రాష్ట్రంలో అల్గాపూర్ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎఐయుడిఎప్ ఎమ్మెల్యే నిజాముద్దీన్ చౌదరి ఈ ఏడాది మే 19,23  తేదీల్లో   రెండు సార్లు  అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

హెయ్‌లకండి సర్క్యూట్ హౌస్‌లో ఈ దారుణం జరిగినట్టు ఆమె పోలీసులకు తెలిపింది. రెండు సార్లు ఆ ఎమ్మెల్యేలకు తన భర్తే సహకరించారని బాధితురాలు ఆరోపించారు. 

ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే తనను గువాహటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే  తాను ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించడంతో ఆ ప్రయత్నం నుండి  విరమించుకొన్నాడని బాధితురాలు తెలిపారు.  తాను ఇంటి నుండి బయటకు రాకుండా తన భర్త అడ్డుకోవడంతో ఇంతకాలం పాటు ఈ విషయమై ఫిర్యాదు చేయలేదని బాధితురాలు చెప్పారు.

అయితే తన భర్తకు తెలియకుండా ఇంటి నుండి తప్పించుకొని పారిపోయి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు తెలిపారు. ఇదిలా ఉంటే తనపై వచ్చిన ఆరోపణలపై  ఎమ్మెల్యే నిజాముద్దీన్ స్పందించారు. తనను అప్రతిష్టపాల్జేసేందుకే అత్యాచారం ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కుటుంబతగాదాలను పరిష్కరించుకొనేందుకు ఆ మహిళ తన వద్దకు వచ్చినట్టు ఎమ్మెల్యే చెప్పారు.  ఆ వివాహిత చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని చెప్పారు.