మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. తనను మిల్లు యజమాని మహేశ్ సాహు మూడు రోజుల పాటు బందీగా వుంచాడని.. దీనితో పాటు బలవంతంగా మూత్రం తాగించాడని రంజిత్ ఆరోపించాడు.

దేశంలో ఇప్పటికే దళితులపై మూత్ర విసర్జన వ్యవహారం కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. సాగర్‌లోని పల్స్ మిల్లు యజమాని తన చేత బలవంతంగా మూత్రం తాగించాడని రంజిత్ లోధీ అనే వ్యక్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాను పోలీసులను ఆశ్రయించినా వారు పట్టించుకోలేదని, దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఫిర్యాదు చేశానని రంజిత్ చెప్పాడు. ఆ వెంటనే అతనికి మద్ధతుగా కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దొంగతనం ఆరోపణలపై యువకుడిని కొట్టిన వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు ప్రెస్‌మీట్‌ను రద్దు చేశారు. 

తనను మిల్లు యజమాని మహేశ్ సాహు మూడు రోజుల పాటు బందీగా వుంచాడని.. దీనితో పాటు బలవంతంగా మూత్రం తాగించాడని రంజిత్ ఆరోపించాడు. గత నెలలో జరిగిన ఈ ఘటనపై తన ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు నిరాకరించారని లోధీ చెప్పాడు. అంతేకాదు.. ఈ కేసులో జోక్యం చేసుకోవాలని మిల్లు యజమాని ఓ సీనియర్ మంత్రిని కోరాడని రంజిత్ ఆరోపించాడు. అందుకే పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోలేదని పేర్కొన్నాడు. పోలీసుల నిర్లక్ష్యం పట్ల విసుగు చెందిన లోధీ సహాయం కోసం భోపాల్‌లోని కాంగ్రెస్ నాయకులను ఆశ్రయించాడు. ఈ విషయాన్ని ప్రస్తావించేందుకు కాంగ్రెస్ తొలుత మీడియా సమావేశం నిర్వహించాలని భావించింది. 

ALso Read: ఘోరం.. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలన్నందుకు వృద్ధుడిని చితకబాది, మూత్రం పోసిన పక్కింటి వ్యక్తి..

అయితే ప్రెస్ మీట్ జరగడానికి ముందే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వీడియోలో మనోజ్ అహిర్వార్ అనే యువకుడు 15 కిలోల పప్పులను దొంగిలించాడని ఆరోపిస్తూ దారుణంగా కొట్టాడు. దాడి చేసిన వారిలో రంజిత్ లోధీ కూడా వున్నాడు. దాడిలో రంజిత్ లోధీ ప్రమేయంతో పరిస్ధితి మరింత ముదురుతున్న ఆందోళనతో కాంగ్రెస్ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించకూడదని నిర్ణయించుకున్నారు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఫిర్యాదు తీసుకుని దాడికి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సోమవారం మనోజ్ అహిర్వార్.. పోలీస్ స్టేషన్‌కు వచ్చి దాడి చేసిన వారిని గుర్తించినట్లు సాగర్ పోలీసులు తెలిపారు. తనపై దాడి చేసిన వీడియోను 2022లో చిత్రీకరించినట్లు పోలీసులకు సమాచారం అందించారు.