భోపాల్: ఓ వివాహితతో  అదే గ్రామానికి చెందిన వ్యక్తి పారిపోయినందుకు నిరసనగా  ఆ కుటుంబసభ్యులను చెట్టుకు కట్టేసి గ్రామస్తులు చితకబాదారు. ఈ ఘటన  మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

భోపాల్ పట్టణానికి 230 కి.మీ. దూరంలో ఉన్న ధర్ పట్టణంలోని అర్జున్ కాలనీలో ఈ ఘటన జరిగింది.ముఖేష్ కుమార్ అనే  వ్యక్తి అదే గ్రామానికి చెందిన వివాహితను తీసుకొని పారిపోయాడు. అయితే పారిపోయిన ముఖేష్‌ను గ్రామస్తులు పట్టుకొచ్చారు.

చెట్టుకు కట్టేసి అతడిని కొట్టారు. ముఖేష్‌తో పాటు అతనికి సహకరించారనే నెపంతో మరో ఇద్దరు గ్రామస్తులను కూడ చెట్టుకు కట్టేసి చితకబాదారు. ముఖేష్ కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలికపై కూడ గ్రామస్తులు దాడికి దిగారు.

ఈ ముగ్గురిని చితకబాదిన ఘటనను కొందరు గ్రామస్తులు వీడియో తీశారు. ఎవరూ కూడ ఈ తతంగాన్ని ఆపేందుకు ప్రయత్నించలేదు.  అయితే ఈ దాడికి పాల్పడిన నిందితుల్లో  ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా  ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.