ఢిల్లీలో గాలిపటం దారం మెడకు చుట్టుకుని.. గొంతు తెగడంతో ఓ షాపు యజమాని మరణించిన ఘటన విషాదాన్ని నింపింది. 

ఢిల్లీ : ఢిల్లీలో విషాద ఘటన చోటు చేసుకుంది. వాయువ్య ఢిల్లీలోని మయూరా ఎన్ క్లేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాలి పటం దారం తగిలి.. గొంతు కోసుకుపోవడంతో సుమిత్ రంగ అనే యువకుడు మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు మంగళవారం తెలిపారు. ఓ షాపు యజమాని అయిన సుమిత్ స్థానిక హైదర్ పుర్ ఫ్లై ఓవర్ వద్ద టూ వీలర్ పై వస్తుండగా గాలిపటం దారం మెడకు చుట్టుకుపోయింది. దీంతో అది గమనించిన చుట్టుపక్కల వారు.. అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, తెలంగాణలోని మంచిర్యాలలో ఇలాంటి ఘటనే ఈ జనవరిలో చోటు చేసుకుంది. గాలి పటం ఎగిరేసేందుకు వాడే మాంజా దారం గొంతుకు చుట్టుకుని భీమయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటుంటే.. పండుగ రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్సింది. ఎలా జరిగిందంటే.. మంచిర్యాలలో భీమయ్య, అతని భార్య టూ వీలర్ మీద వెడుతున్నారు. సంక్రాంతి కావడంతో పిల్లలు, పెద్దలంతా పతంగులు ఎగురవేస్తూ.. సరదాగా ఉన్నారు. 

గాలిపటం దారం మెడకు కోసుకొని... ఇంజినీర్ మృతి

ఆ సమయంలో గాలిపటం ఎగురవేసేందుకు ఉపయోగించిన మాంజా బైక్ నడుపుతున్న భీమయ్య గొంతుకు చుట్టుకుపోయింది. టూ వీలర్
వేగంగా ఉండడంతో మాంజా భీమయ్య గొంతుకు బిగుసుకుపోయింది. మాంజా దారం షార్ప్ గా ఉంటుంది. దీనివల్ల గొంతు కోసుకుపోయి రక్తం కారింది. వెంటనే భీమయ్య బైక్ పై నుండి కిందపడిపోయాడు. వెనకున్న భార్య తేరుకుని.. అతడిని గమనించే లోపే అక్కడికక్కడే మరణించాడు. పండుగ రోజే.. తన కళ్ల ముందే.. భర్త చనిపోవడంతో తట్టుకోలేని ఆ భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది.

దేశంలో మాంజా గొంతుకు బిగుసుకుపోయి పలువురు మరణించిన ఘటనలు గతంలో కూడా చాలా చోటు చేసుకొన్నాయి. నిరుడు ఆగష్టు ఢిల్లీలో మాంజా గొంతుకు బిగుసుకుని.. 23 ఏళ్ల ఓ వ్యక్తి మరణించాడు. అతను వాయువ్య ఢిల్లీలోని కన్హయ్యనగర్ లోని తన బంధువుల ఇంటికి వెడుతున్నారు. ఆ సమయంలో గాలిపటం దారం వ్యక్తి గొంతుకు బిగుసుకుపోయింది.

ఇక ఇంకో ఘటనలో.. ఒడిశా రాష్ట్రంలో కొత్తగా పెళ్లైన వరుడు మాంజాకు బలయ్యాడు. అతని మెడకు మాంజా చుట్టుకుని మరణించాడు. నిరుడు డిసెంబర్ 2న కటక్ జిల్లా భైర్‌పూర్ ప్రాంతానికి చెందిన జయంత్ సమల్ ఇలాగే మరణించాడు. అతను తన భార్యతో కలిసి బైక్ పై వెడుతుండగా.. మాంజా దారం గొంతుకు చుట్టుకుపోయి.. గొంతు తెగి గాయమైంది. ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే.. రక్తస్రావం అయి మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు.

మాంజాతో ఇలాంటి మరణాలు సంభవిస్తుండడంతో 2016లో ఒడిశా హైకోర్టు మాంజాను నిషేధించింది. అయినా కూడా గాలిపటం ఎగురవేయడానికి ఇలాంటి మాంజాను వాడడం వల్లే జయంత్ మరణించాడని మృతుడి బంధువులు చెబుతున్నారు. ఇక, ఢిల్లీలోని పశ్చిమ విహార్లో ఇలాగే.. మాంజా గొంతుకు చుట్టుకుని 2019 ఆగష్టు 19న మానవ్ అనే సివిల్ ఇంజనీర్ చనిపోయాడు. తన సోదరితో కలిసి బైక్ మీద వెడుతున్న సమయంలో మాంజా గొంతుకు బిగుసుకుందని పోలీసులు తెలిపారు.