ఆధార్ కార్డ్...ఇపుడు ప్రతి భారతీయుడి వద్ద ఉండే గుర్తింపు కార్డు. అయితే ఈ కార్డును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంక్షేమ కార్యక్రమం, ప్రభుత్వ పనులకోసం వాడుకుంటోంది.  అంతేకాకుండా ప్రతి భారతీయుడి బ్యాంకు ఖాతాకు ఆధార్ ని అనుసంధానం చేసింది. ఇదే ఇపుడు సైబర్ నేరగాళ్లు వరంగా మారింది. ఈ ఆధార్ నంబర్ తెలుసుకోవడం ద్వారా ఖాతాదారుల ఖాతాల్లోకి చొరబడి సైబర్ నేరగాళ్లు సునాయాసంగా డబ్బులు దోచేస్తున్నారు.

అయితే ఇలా ఆధార్ కార్డు నంబర్ బైటపెట్టడం వల్ల ప్రమాదమేమీ ఉండదంటూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ఆర్‌ఎస్ శర్మ తెలిపిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఆయన ఓ సవాల్ విసిరారు.  తన ఆధార్ నంబర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసి శర్మ ఇపుడు చూద్దాం తనను ఎవరు మోసం చేస్తారో అంటూ కామెంట్ పెట్టాడు. 

అయితే ఈ సవాల్ ను స్వీకరించిన ఓ హ్యాకర్ ట్రాయ్ చైర్మన్ కు షాకిచ్చాడు. ఆధార్ నంబర్ ను ఆధారంగా చేసుకుని శర్మకు బ్యాంకు ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందని గుర్తించాడు హ్యాకర్. దీంతో బీమ్ యాప్ ద్వారా ఎవరి అనుమతి లేకుండానే, అసలు శర్మకు కూడా తెలియకుండానే అకౌంట్ లో రూ.1 డిపాజిట్ చేశాడు. ఇలా హ్యాకర్ ట్రాయ్ చైర్మన్ ఖాతాలో రూ.1 వేసినట్లు వచ్చిన కన్పర్మేషన్ మెసేజ్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీని కింద ఓ కామెంట్ పెట్టాడు. యూజర్ ప్రైవసీ కోసం ప్రభుత్వాలు మరింత జాగ్రత్తగా, కట్టుదిట్టమైన ఇంజనీరింగ్ వ్యవస్థను వాడాలంటూ సూచించాడు.

ఇలా తన ఆధార్ నంబర్ బైటపెట్టిన ట్రాయ్ ఛైర్మన్ ఇప్పుడు అదెంత ప్రమాదకరమో గుర్తించారు. తన వివరాలన్నీ బట్టబయలైతే గానీ అతడికి అసలు విషయం బోధపడలేదంటూ సోషల్ మీడియాలో ఆర్ఎస్ శర్మ పై ట్రోలింగ్ జరుగుతోంది.