లవ్ మ్యారేజ్ చేసుకున్న నెలరోజులకు ఓ యువకుడు స్మశానంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 

చెన్నై : తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని ముత్తుపేట సమీపంలోని కొవిలూరు స్మశాన వాటిక సమీపంలో సోమవారం ఉదయం ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. ఇది గమనించిన స్థానికులు ముత్తుపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిశీలించారు.

మృతదేహాన్ని చెట్టు నుంచి కిందికి దింపి పోస్టుమార్టం కోసం తిరుతురపూండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు సంతోష్ (20) అని పోలీసులు గుర్తించారు. అతను ముత్తుపేట సమీపంలోని కొవిలూరు ఉత్తర అటవీ ప్రాంతానికి చెందిన మణికంఠం అనే వ్యక్తి కొడుకు అని పోలీసుల విచారణలో తేలింది.

కుమార్తెను భుజాలపై ఎక్కించుకుని వెళ్తున్న వ్యక్తిపై నడిరోడ్డులో కాల్పులు..పరిస్థితి విషమం..

సంతోష్ మంగళూరుకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. కొద్దికాలం కలిసి తిరిగారు. ఆ అమ్మాయి గర్భం దాల్చింది. ఆ తరువాత యువకుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో యువతి ముత్తుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇరు కుటుంబ సభ్యులను పిలిపించారు. వారిద్దరితో మాట్లాడి రాజీ చేశారు. నెల క్రితం వీరికి పెళ్లి కూడా చేశారు. ఆ తరువాత ఆ యువకుడు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.