కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి అన్న భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. అయితే ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు. 

బెంగళూరు : మరిది చేతిలో వదిన దారుణ హత్యకు గురైన ఘటన బెంగళూరులోని హుబ్లీ జిల్లాలోని కుందగోళ తాలూకా ఏరినారాయణపుర గ్రామంలోచోటు చేసుకుంది. హతురాలు సునంద మెణసినకాయి. కాగా నిందితుడిని మంజునాథగా గుర్తించారు. కుటుంబ కలహాలు తీవ్రస్థాయికి చేరడంతో ఈ హత్య జరిగిందని తెలుస్తోంది. కొడవలితో పట్టపగలే హత్య జరగడంతో గ్రామంలో భయాందోళనకు పరిస్థితులు నెలకొన్నాయి. కుందగోళ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు కారణం వివాహేతర సంబంధమా? లేక మరేదైనా కారణమా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. 

కాగా ఇలాంటి ఘటనే ఆగస్ట్ లో విశాఖపట్నంలో చోటుచేసుకుంది. రైలు కిందపడి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇష్టపడిన యువకుడితో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేసింది. అయితే, సదరు యువకుడు గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. జిఆర్పీ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… గోపాలపట్నం సమీపంలోని కొత్తపాలేనికి చెందిన కొణతాల హేమలత (25) భర్తతో విభేదాల కారణంగా రెండేళ్లక్రితం వెళ్ళిపోయింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళ పాలెంలోని పుట్టింట్లో ఉంటుంది. ఆమె బ్యూటీషియన్ గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో కోటనరవకు చెందిన ఆటో డ్రైవర్ కె. కుమార్ తో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. 

స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. చంపి, చేపలచెరువులో పడేసిన ప్రియుడు...

ఈ క్రమంలోనే ఘటన జరిగిన ముందురోజు అమ్మగారి ఇంటి నుంచి హేమలత బయటకు వెళ్లి కుమార్ను కలిసింది. ఇద్దరూ కలిసి సతివానిపాలెం రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లి రాత్రంతా గడిపారు. మరుసటిరోజు వేకువజామున ఇద్దరూ ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో ఇద్దరు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఇద్దరూ కలిసి ట్రాక్స్ మీద పడుకున్నారు. అయితే రైలు రావడం ఆలస్యం కావడంతో ఇద్దరూ సమీపంలోని బడ్డీ వద్దకు వచ్చి కాసేపు గడిపారు. మళ్లీ కాసేపటి తర్వాత ఆత్మహత్యాయత్నానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆఖరి క్షణంలో మనసు మార్చుకున్న కుమార్ ఆ ప్రయత్నం విరమించుకుందామని హేమలతను వెనక్కి లాగే ప్రయత్నం చేశాడు. కానీ హేమలత ససేమిరా అని రైలుకు ఎదురుగా వెళ్ళింది. ఈ గ్రామంలో ఇద్దరికీ పెనుగులాట జరిగింది. రైలు వేగంగా రావడంతో ట్రాక్ మీద ఉన్న హేమలతను బలంగా ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అదే సమయంలో కుమార్ పక్కకి ఉండడంతో రైలు వేగానికి తుళ్ళి రాళ్ళపై పడిపోయాడని.. జిఆర్ పి పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటన జరిగిన ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా ఉండడంతో తెల్లారి ఉదయం వరకు ఈ ఘటన ఎవరికీ తెలియలేదు. అయితే బహిర్భూమికి వెళ్లిన అక్కడి ప్రైవేట్ కంపెనీకి చెందిన గార్డు అప్పలరాజు.. గాయాలతో మూలుగుతున్న కుమార్ ను చూశాడు. వెంటనే సమీపంలోని రోడ్డు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి బైక్ మీద వెళుతున్న జగదీష్ ను ఆపి ఘటనా స్థలానికి తీసుకువెళ్ళాడు. వెంటనే 108కి సమాచారం అందించి చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. సమాచారం అందుకున్నటి జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హేమలత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన కారణం ఏంటనేది కుమార్ కోలుకున్నాకే తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఆ దిశగా జిఆర్ పి సిఐ కె.కోటేశ్వరరావు, ఆధ్వర్యంలో ఎస్ఐ బాలాజీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు హేమలతకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.