సిక్కులు (sikhs) అత్యంత పవిత్రంగా భావించే అమృత్‌సర్‌లోని (amritsar) గోల్డెన్ టెంపుల్‌లో (golden temple) హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఒక వ్యక్తిని శనివారం కొట్టి చంపడం కలకలం రేపింది. 

సిక్కులు (sikhs) అత్యంత పవిత్రంగా భావించే అమృత్‌సర్‌లోని (amritsar) గోల్డెన్ టెంపుల్‌లో (golden temple) హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఒక వ్యక్తిని శనివారం కొట్టి చంపడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. శనివారం 24 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న ఒక యువకుడు గోల్డెన్ టెంపుల్ లోపలికి దూసుకెళ్లాడు. అక్కడ పూజలో ఉంచిన తల్వార్‎ను తీసేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడ అక్కడున్న భక్తులు, ఆలయ సిబ్బంది వెంటనే అతడిని బయటకు లాక్కొచ్చి చితక్కొట్టారు. తీవ్ర గాయాలతో అతను మరణించాడు. అనంతరం మృతదేహాన్ని సివిల్‌ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

తొలుత ఆ యువకుడు గర్భగుడి లోపల గోల్డెన్ గ్రిల్స్ దూకి తల్వార్ తీసుకుని, ఒక సిక్కు పూజారి పవిత్ర గురు గ్రంథ్ సాహిబ్ (guru granth sahib) పఠిస్తున్న ప్రదేశానికి చేరుకున్నాడు. అతన్ని వెంటనే శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (shiromani gurdwara parbandhak committee) టాస్క్‌ఫోర్స్ సభ్యులు పట్టుకున్నారని పోలీసులు తెలిపారు. 

అతన్ని ఎస్‌జీపీసీ కార్యాలయానికి తీసుకెళ్తుండగా.. ఆగ్రహంతో ఉన్న అక్కడి వారు తీవ్రంగా కొట్టారని చెప్పారు. మృతుడిని యూపీకి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. అతను స్వర్ణ దేవాలయంలోకి ఎప్పుడు ప్రవేశించాడు. అతనితో పాటు ఎవరైనా వున్నారా అని తెలుసుకోవడానికి ఆలయంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ సంఘటన తర్వాత, పెద్ద సంఖ్యలో సిక్కులు, వివిధ సిక్కు సంస్థలు ఎస్‌జీపీసీ నిర్లక్ష్యంపై మండిపడ్డారు. పరిస్ధితి ఉద్రిక్తంగా మారుతుండటంతో తేజా సింగ్ సముంద్రి హాల్‌లోని ఎస్‌జీపీసీ కాంప్లెక్స్ చుట్టూ భారీగాత పోలీసు బలగాలను మోహరించారు.