ఆవు మాంసం తరలిస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని స్థానికులు విచక్షణా రహితంగా కొట్టారు. సుత్తితో కొట్టి హింసించారు. కాగా.. సదరు యువకుడిని ఒంటరివాడిని చేసి దాడి చేస్తుండగా.. స్థానికులు, పోలీసులు కూడా చూస్తూ ఉండిపోయారు తప్ప.. ఎవరూ కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ దారుణ సంఘటన గుడ్ గావ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శుక్రవారం ఉదయం 9గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  లక్ష్మణ్ అనే యువకుడు ట్రక్కులో ఆవు మాంసం తరలిస్తున్నాడనే అనుమానంతో.. అతని వాహనాన్ని కొందరు అడ్డుకున్నారు. అనంతరం ట్రక్కులో నుంచి సదరు యువకుడిని కిందకు లాగి.. అనంతరం అతి దారుణంగా సుత్తులతో, ఆయుధాలతో అతనిపై దాడి చేశారు. దేశ రాజధాని ఢిల్లీకి అతి సమీపంలో ఈ దారుణం చోటుచేసుకోవడం గమనార్హం.

కాగా.. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. అంతేకాకుండా కనీసం ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. అయితే.. అతని ట్రక్కులో ఉన్నది నిజంగా ఆవు మాంసం అవునో కాదో తేల్చుకునేపనిలో పోలీసులు పడ్డారు. ఆ మాంసాన్ని పరీక్షించేందుకు ల్యాబ్ కి తరలించారు. 

సదరు యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే... యువకుడు నడిపిన ట్రక్కు యజమానులు మాత్రం ఎన్నో సంవత్సరాలుగా బీఫ్ వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది