Bihar: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై దాడి జరిగింది. ఆయన స్వగ్రామం భక్తియార్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ వ్యక్తి సీఎంపై దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bihar : ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనవసరం లేదు. ఆయనను కలుసుకోవాలంటే కట్టుదిట్టమైన భద్రతను దాటిపోవాలి. అయితే, ముఖ్యమంత్రి కాపలాగా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు.. కార్యకర్తలు ఉన్నారు.. పోలీసులు ఉన్నారు.. అధికారులు ఉన్నారు.. వీరందరూ చూస్తుండగానే ముఖ్యమంత్రి పై దాడి చేశాడు ఓ వ్యక్తి. బీహార్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
వివరాల్లోకెళ్తే.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఓ వ్యక్తి దాడి చేశారు. ఆయన స్వగ్రామం భక్తియార్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ వ్యక్తి ఆయనపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. ఆ వీడియో దృశ్యాలను గమనిస్తే.. సీఎం నితీష్ కుమార్‌ను వేదికపై కొట్టేందుకు ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ దాడి నుంచి సీఎం క్షేమంగా తప్పించుకోగా, ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రిని కొట్టేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి వేదికపైకి వేగంగా అడుగులు వేస్తున్నట్లు వీడియోలో ఉంది. అయితే, వెంటనే ఆ వ్యక్తిని సీఎం భద్రతా సిబ్బంది ఈడ్చుకెళ్లారు.
నిందితుడిని భక్తియార్‌పూర్‌లోని మహ్మద్‌పూర్ ప్రాంతానికి చెందిన శంకర్ కుమార్ వర్మ అలియాస్ ఛోటూ (32)గా గుర్తించారు. ఆ ప్రాంతంలో చిన్న నగల దుకాణం నడుపుతున్నాడు. ప్రాథమిక విచారణలో శంకర్ మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు. అతని కుటుంబీకుల కథనం ప్రకారం, శంకర్ గతంలో రెండుసార్లు పైకప్పుపై నుండి దూకి మరియు గొంతు కోసుకుని తన బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అతని భార్య, పిల్లలు అతని నుంచి వేరుపడి జీవిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. తనపై దాడికి పాల్పడిన ఆ వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దనీ, ఆయన చేసిన ఫిర్యాదులను పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
సీఎం నితీశ్‌పై జరిగిన దాడిని ఖండించిన బీజేపీ, ఆర్జేడీ
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై దాడిని భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలు ఖండించాయి. ఈ ఘటన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ సింగ్ డిమాండ్ చేశారు. దీంతో పాటు ముఖ్యమంత్రి భద్రతలో ఉన్న అధికారులు, భద్రతా సిబ్బంది అందరినీ విచారించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ కూడా దాడిని ఖండించింది, "ఏదైనా అసంతృప్తి లేదా తమ నిరసనను, ఆగ్రహాన్ని ప్రజాస్వామ్య మార్గాల ద్వారా మాత్రమే వ్యక్తపరచబడాలి" అని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
