ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను, అత్తామామలను నరికి చంపి.. చేతిలో 9 నెలల చిన్నారితో.. పోలీసుల దగ్గరికి...
అస్సాంలో ట్రిపుల్ మర్డర్ కలకలం రేపింది. ప్రేమించి, పెళ్లి చేసుకున్న భార్య, ఆమె తల్లిదండ్రులను దారుణగా కొడవలితో నరికి చంపాడు ఓ వ్యక్తి.

గౌహతి : అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో కోవిడ్ లాక్‌డౌన్ లో మొదలైన ప్రేమకథ దారుణమైన ట్రిపుల్ మర్డర్‌తో ముగిసింది.
25 ఏళ్ల నజీబుర్ రెహ్మాన్ బోరా, 24 ఏళ్ల సంఘమిత్ర ఘోష్ లు కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత వీరి బంధంలో చీలికలు వచ్చాయి. ఆ గొడవలు చివరికి ఈ సోమవారం సంఘమిత్ర ఘోష్, ఆమె తల్లిదండ్రులను హత్య చేయడంతో ముగిశాయి.
వీరిని హత్య చేసిన నజీబుర్ రెహ్మాన్ వారి తొమ్మిది నెలల శిశువును చేతుల్లో ఎత్తుకుని వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం, మెకానికల్ ఇంజనీర్ అయిన నజీబుర్, సంఘమిత్ర జూన్ 2020లో దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ ఉన్న సమయంలో ఫేస్‌బుక్‌లో స్నేహితులయ్యారు.
వ్యక్తిని బంధించి, ప్యాంటు విప్పించి.. నోటితో షూ తీయించారు.. వీడియో వైరల్, ముగ్గురు అరెస్ట్...
వీరిద్దరి మధ్య నెలరోజుల్లోనే స్నేహం ప్రేమగా మారింది. అదే సంవత్సరం అక్టోబర్‌లో ఇద్దరూ కోల్‌కతాకు పారిపోయారు. సంఘమిత్ర తల్లిదండ్రులు ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చారు, అయితే ఆమె అప్పటికే కోల్‌కతా కోర్టులో నజీబర్‌ను వివాహం చేసుకుంది. మరుసటి సంవత్సరం, సంఘమిత్ర తల్లిదండ్రులు సంజీవ్ ఘోష్, జును ఘోష్ ఆమెపై దొంగతనం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంఘమిత్రను అరెస్టు చేసి నెల రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. బెయిల్ పొందిన తర్వాత ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చిందని పోలీసులు తెలిపారు. జనవరి 2022లో, సంఘమిత్ర, నజీబుర్ మళ్లీ పారిపోయారు, ఈసారి చెన్నైకి వెళ్లారు. అక్కడ వారు ఐదు నెలలు ఉన్నారు. ఆ దంపతులు ఆగస్టులో గోలాఘాట్‌కు తిరిగి వచ్చేసరికి సంఘమిత్ర గర్భవతి.
గోలాఘాట్ కు వచ్చిన తరువాత నజీబుర్ ఇంట్లో ఉంటున్నారు. గత నవంబర్‌లో వీరికి కొడుకు పుట్టాడని పోలీసులు తెలిపారు. అయితే, నాలుగు నెలల తర్వాత, ఈ ఏడాది మార్చిలో సంఘమిత్ర తన కొడుకుతో కలిసి నజీబుర్ ఇంటినుంచి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. నజీబుర్ తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు.. హత్యాయత్నం కేసు నమోదు చేసి నజీబుర్‌ను అరెస్టు చేశారు. అతను 28 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుండి బయటకు వచ్చిన నజీబుర్ తన బిడ్డను చూడాలనుకున్నాడు. కానీ సంఘమిత్ర కుటుంబం అతన్ని అనుమతించలేదు. వాస్తవానికి, ఏప్రిల్ 29న సంఘమిత్ర, ఆమె కుటుంబ సభ్యులు నజీబుర్‌పై దాడి చేశారని నజీబుర్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సోమవారం మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నజీబుర్ తన భార్య సంఘమిత్ర, ఆమె తల్లిదండ్రులను హత్య చేశాడు. ఆ తర్వాత తన తొమ్మిది నెలల చిన్నారితో పారిపోయాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
సంఘమిత్ర, ఆమె తల్లిదండ్రుల మృతదేహాలు వారింట్లో కొడవలి గాయాలతో రక్తసిక్తమై.. రక్తపు మడుగులలో పడి ఉన్నాయి.నిందితుడిపై హత్య, అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించడంలపై కేసు నమోదు చేశామని అస్సాం పోలీసు చీఫ్ జీపీ సింగ్ ట్వీట్ చేశారు. ఈ దారుణ హత్యపై రాష్ట్ర సీఐడీ బృందం విచారణ చేపట్టింది. ఫోరెన్సిక్ బృందాలను కూడా రప్పించామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.