పశ్చిమ బెంగాల్‌లో యాస్ తుఫాను బీభత్సంపై ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరగాల్సి ఉండగా, ప్రతిపక్ష నేతలను ఆహ్వానించడమేమిటని మమత నిలదీశారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ మినహా ప్రతిపక్ష నేతలు ఈ సమావేశానికి వస్తే, తాను ఈ సమావేశంలో పాల్గొనబోనని కేంద్ర ప్రభుత్వానికి ఆమె తేల్చి చెప్పారు. 

పశ్చిమ బెంగాల్‌లోని కలైకుండలో జరిగే సమీక్షా సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో తాను పాల్గొంటానని గురువారం స్వయంగా మమత బెనర్జీ ప్రకటించారు. అయితే ఈ సమావేశానికి బీజేపీ నేత సువేందు అధికారి, బీజేపీ ఎంపీ దేబొశ్రీ చౌదరి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లను కూడా కేంద్రం ఆహ్వానించింది.

Also Read:భయంకరమైన తుఫాన్.. బయటకెందుకు వచ్చావ్ అంటే.. ఏమన్నాడో తెలుసా?

ప్రధాని మోడీ పంపించిన అతిథుల జాబితాలో తన పాత మిత్రుడు, ప్రస్తుత ప్రత్యర్థి అయిన సువేందు అధికారి, బీజేపీ ఎంపీ దేబొశ్రీ చౌదరి పేర్లు ఉండటంతో మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో కేవలం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సీఎస్, గవర్నర్ మాత్రమే పాల్గొంటేనే తాను హాజరవుతానని ఆమె స్పష్టం చేశారు. ఇతరులు ఎవరు హాజరైనా తాను ఈ సమావేశంలో పాల్గొనేది లేదని కరాఖండీగా చెప్పారు. తన అభ్యంతరాలను ఆమె కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. ప్రధాని మోడీకి కలైకుండ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో గవర్నర్ జగ్‌‌దీప్ ధన్‌కర్ స్వాగతం పలకనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగే సమీక్షా సమావేశంలో గవర్నర్ కూడా పాల్గొననున్నారు.