Asianet News TeluguAsianet News Telugu

INDIA Bloc: ఇండియా కూటమి గట్టి దెబ్బ.. కాంగ్రెస్‌తో పొత్తు లేదు, ఒంటరిగా పోటీ చేస్తాం: మమతా బెనర్జీ సంచలనం

ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌తో పొత్తులో లేమని మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్‌లో అన్ని లోక్ సభ సీట్లలో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేసింది.
 

mamata banerjee shock to india bloc, tmc will contest all lok sabha seats in west bengal alone kms
Author
First Published Jan 24, 2024, 2:05 PM IST

Mamata Banerjee: కాంగ్రెస్ సారథ్యంలోని కాంగ్రెస్‌కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. ఇండియా కూటమిలో ముఖ్యమైన పార్టీగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఈ అలయెన్స్ నుంచి తప్పుకుంటున్నది. పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగానే పోటీ చేస్తామని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ వెల్లడించింది. కాంగ్రెస్‌తో తమకు పొత్తు లేదని బెంగాల్ సీఎం స్పష్టం చేసింది.

బెంగాల్‌లోని 42 లోక్ సభ సీట్లలో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని దీదీ తెలిపారు. ‘కాంగ్రెస్‌తో మాకు ఏ సంబంధం లేదు. మేం ఒంటరిగా పోటీ చేస్తాం. ఎన్నికల తర్వాత జాతీయ స్థాయి కూటమిపై ఆలోచిస్తాం’ అని మమతా బెనర్జీ అన్నారు. ‘సీట్ల పంపకాలపై మేం చేసిన ప్రతిపాదనలు అన్నింటినీ వారు తిరస్కరించారు. అప్పటి నుంచే మేం బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం’ అని వివరించారు.

అంతేకాదు, రాహుల్ గాంధీపైనా ఆమె విరుచుకుపడ్డారు. భారత్ జోడో న్యాయ్ యాత్రను కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నది. బెంగాల్‌లో గురువారం ప్రవేశించనుంది. ఈ సమయంలోనూ మర్యాదపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ వారి యాత్ర గురించి చెప్పి ఉండాల్సిందని, కానీ, అలా చేయలేదని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ వివరించారు. ‘వాళ్లు నా రాష్ట్రానికి వస్తున్నారు. కానీ, కనీసం మర్యాదపూర్వకంగానైనా ఈ విషయాన్ని తమకు తెలియజేయలేదని వివరించారు.

Also Read: బెంగాల్‌లో కాంగ్రెస్‌కు కొత్త సమస్య.. దీదీపై సొంత పార్టీ నేతల విమర్శలు.. నష్ట నివారణకు రాహుల్ గాంధీ ప్రయత్నం

‘దేశంలో ఇండియా కూటమి కొనసాగుతుంది. కానీ, బెంగాల్‌లో మాత్రం తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేస్తుంది. బెంగాల్‌లో బీజేపీకి బుద్ధిచెప్పే పార్టీ ఒక్క తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే’ అని దీదీ ఇటీవలే అన్నారు. 

బెంగాల్‌లోని 42 లోక్ సభ స్థానాల్లో పది సీట్లు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసినట్టు తెలిసింది. అయితే, టీఎంసీ మాత్రం రెండు స్థానాల్లోనే పోటీకి అవకాశం ఇస్తామని స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో రెండే సీట్లు గెలిచిన కాంగ్రెస్‌కు పది సీట్లు ఎలా ఇస్తామని టీఎంసీ నేతలు చర్చించికున్నట్టు తెలిసింది.

ఇదిలా ఉండగా, టీఎంసీ ఇది వరకే ఇండియా కూటమిలో ఓ కీలక ప్రతిపాదన చేసింది. ప్రాంతీయ పార్టీలు వాటి బలం ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పోటీ చేయరాదని, ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలని టీఎంసీ పేర్కొంది. మిగిలిన 300 స్థానాల్లో కాంగ్రెస్ నేరుగా బీజేపీతో పోటీ చేయాలని, అక్కడ మిగిలిన పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాయని ప్రతిపాదించింది. కానీ, ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించలేదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios