Asianet News TeluguAsianet News Telugu

అల్ల‌ర్లు సృష్టించేందుకు ఇత‌ర రాష్ట్రాల నుంచి గూండాలు.. బీజేపీ పై మ‌మ‌తా ఫైర్   

బీజేపీ చేప‌ట్టిన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో హింస చెల‌రేగ‌డం ప‌ట్ల ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తీవ్రంగా మండిప‌డ్డారు. రాష్ట్రంలో ఘ‌ర్ష‌ణ‌లు సృష్టించాల‌ని బీజేపీ ఇత‌ర రాష్ట్రాల నుంచి రైళ్ల‌ల్లో బాంబులు, గ‌న్‌ల‌తో గూండాల‌ను ర‌ప్పించింద‌ని ఆరోపించారు.

Mamata Banerjee says BJP Brought Goons Armed With Bombs From Outside Bengal For Nabanna Chalo Rally
Author
First Published Sep 15, 2022, 2:02 AM IST

ప‌శ్చిమ బెంగాల్ లోని మమతా బెనార్జీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా బీజేపీ చేప‌ట్టిన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో హింస చెల‌రేగ‌డం ప‌ట్ల ఆ రాష్ట్ర‌ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తీవ్రంగా మండిప‌డ్డారు. రాష్ట్రంలో అల్ల‌ర్లు సృష్టించాలనే బీజేపీ ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లలో బాంబులు, గ‌న్‌ల‌తో గూండాలను ర‌ప్పించి.. నిర‌స‌న పేరుతో ఘ‌ర్ష‌ణ‌లు  సృష్టిస్తోందని ఆరోపించారు.

పోలీసుల ప‌ట్ల బిజెపి కార్యకర్తలు అనుచితంగా ప్ర‌వర్తించారని ఆరోపించారు. పోలీసులు కావాలంటే కాల్పులు జ‌రిపే వార‌నీ, కానీ కానీ, కాషాయ కార్య‌క‌ర్త‌లు ఎంత‌ రెచ్చ‌గొట్టినా పోలీసులు లాఠీచార్జి చేయ‌కుండా, ఫైరింగ్‌కు దిగ‌కుండా సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించార‌ని దీదీ పేర్కొన్నారు.  నిర‌స‌న‌ల పేరులో బీజేపీ గూండాలు బాంబులు, బుల్లెట్లు, తుపాకులు, రాళ్లతో దాడి చేశారని, ఇందులో పెద్ద సంఖ్యలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. ఈ చ‌ర్య‌ను ఆమె పూర్తిగా ఖండించారు.

రాజ‌కీయాల్లో సంఘ విద్రోహ శ‌క్తుల ప్ర‌మేయం వాంఛ‌నీయం కాద‌ని అన్నారు. పోలీసుల‌పై దాడి ఘ‌ట‌న‌లో చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోతుంద‌ని అన్నారు. ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. దుర్గాపూజకు ముందే వ్యాపారులు నష్టపోయారని అన్నారు. ప్ర‌జాస్వామ్య‌ దేశంలో శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే దాని పేరుతో ఇలాంటి సంఘవిద్రోహ చర్యలను సహించేది లేదని మమత అన్నారు. గూండాయిజానికి పాల్పడే వారిపై పోలీసులు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చ‌రించారు. బీజేపీ కార్యకర్తలు ఆస్తులను తగలబెట్టారని, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నారని టీఎంసీ అగ్రనేత అన్నారు.

కోల్‌కతాలో మంగళవారం నాడు అధికార తృణమూల్ కాంగ్రెస్ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా   'నబన్న చలో పేరుతో బీజేపీ నిర‌స‌న ర్యాలీని చేపట్టింది. ఈ క్ర‌మంలో బెంగాల్ సెక్ర‌టేరియ‌ట్‌కు ముట్ట‌డి చేయాల‌ని బీజేపీ నాయ‌కులు భావించారు. కానీ అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌త బ‌ల‌గాలు వారిని వెళ్లేందుకు అడ్డుగా  బారికేడ్ల ఏర్పాటు చేసింది.  వారిని నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేసింది. కానీ, బీజేపీ నేతలు బారికేడ్ల‌ను తొల‌గించేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో పోలీసులు నిలువ‌రించారు.

ఈ క్ర‌మంలో నిర‌స‌న‌కారుల‌ను  చెదరగొట్టడానికి పోలీసులు వాటర్ ఫిరంగులు, టియర్ గ్యాస్ షెల్స్ ను ఉప‌యోగించారు.ఈ క్ర‌మంలో  పోలీసులతో బిజెపి కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. దీంతో కోల్‌క‌తా, హౌరా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ప‌రిస్ధితి ర‌ణ‌రంగాన్ని త‌ల‌పించింది. ఈ గందరగోళంలో మినా దేవి పురోహిత్, స్వపన్ దాస్‌గుప్తా సహా పలువురు పోలీసు అధికారులు, ప‌లువురు బిజెపి నాయకులు గాయపడ్డారు. ఈ క్ర‌మంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌, బెంగాల్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

విలేకరుల సమావేశంలో బిజెపి నాయకుడు రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, మమతా బెనర్జీ హయాంలో బెంగాల్ లో అవినీతి రాజ్యమేలుతోంద‌నీ, ప్ర‌శ్నించే  గొంతును అణిచివేసేందుకు ప్ర‌భుత్వం పోలీసుల‌ను అండ‌గా పెట్టిందని ఆరోపించారు. 

హౌరా, కోల్‌కతాలోని లాల్‌బజార్ మరియు ఎంజి రోడ్ ప్రాంతాల్లో హింసాత్మక ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. కోల్‌కతా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉన్న లాల్‌బజార్‌లో పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. బీజేపీ ర్యాలీ సందర్భంగా బౌబజార్ ప్రాంతంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) దేబజిత్ ఛటోపాధ్యాయను కొందరు వ్యక్తులు వెంబడించి కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయ‌ప‌డిన ఆయ‌న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.   

ఇదిలాఉంటే.. పోలీసు అధికారిపై దాడి, పోలీసు వాహనానికి నిప్పు పెట్టినందుకు నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వారిపై హత్యాయత్నం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రభుత్వోద్యోగి విధులకు ఆటంకం క‌లిగించ‌డం వంటి నేరాల కింద వీరిపై కేసులు నమోదు చేశారు.

భాజపా చేపట్టిన 'నబన్న చలో' మార్చ్‌లో జరిగిన గందరగోళంపై సెప్టెంబర్ 19లోగా పశ్చిమ బెంగాల్ హోం కార్యదర్శిని కలకత్తా హైకోర్టు నివేదిక కోరింది. ఏ వ్యక్తిని కూడా చట్టవిరుద్ధంగా నిర్బంధించవద్దని, ప్రజా ఆస్తులకు నష్టం జరగకుండా చూడాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios