రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై విపక్ష పార్టీలతో  బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆప్ కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.  

న్యూఢిల్లీ:TRS బాటలోనే నడవాలని AAP నిర్ణయం తీసుకుంది. Presidential Election పై పశ్చిమ బెంగాల్ సీఎం Mamata Banerjee నిర్వహించే సమావేశానికి ఆప్ కూడా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు న్యూఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో విపక్ష పార్టీల నేతలతో బెంగాల్ సీఎం భేటీ కానున్నారు. టీఆర్ఎస్ బాటలోనే న్యూఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈసమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

also read:రాష్ట్రపతి ఎన్నికలపై మమత బెనర్జీ మీటింగ్: డుమ్మా కొట్టాలని టీఆర్ఎస్ నిర్ణయం

కాంగ్రెస్ పార్టీతో కలిసి వేదికను పంచుకోవడం ఇష్టం లేనందున ఈ సమావేశానికి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. మరో వైపు రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్ధిని ప్రకటించిన తర్వాతే ఈ అంశాన్ని పరిశీలిస్తామని ఆప్ ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై ఇవాళ బీజేపీయేతర పార్టీలతో మమత బెనర్జీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి రావాలని సుమారు 22 పార్టీలకు పైగా ఆమె ఆహ్వానాలు పంపారు. ఈ నెల 14న ఢిల్లీకి వచ్చిన బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను కలిశారు. రాష్ట్రపతి ఎన్నికలపై పవార్ తో ఆమె చర్చించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయబోనని శరద్ పవార్ ఇదివరకే ప్రకటించారు. తాను క్రియాశీల రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటున్నట్టుగా పవార్ ప్రకటించారు.

గత వారమే 22 పార్టీలకు మమత బెనర్జీ లేఖలు రాశారు. ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సహా బీజేపీయేతర పార్టీలను మమత బెనర్జీ ఈ సమావేశానికి ఆహ్వానించారు. మమత బెనర్జీ నిర్వహించే సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పాల్గొంటుంది. రాజ్యసభలో విపక్షనేత మల్లిఖార్జున ఖర్గే, జైరాం రమేష్, రణదీప్ సూర్జేవాలా తదితరులు కాంగ్రెస్ తరపున ఈ సమావేశానికి హాజరు కానున్నారు.

2024 ఎన్నికల్లో మోడీని ఎదుర్కొనే సత్తా తమకే ఉందని ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు గాను ప్రాంతీయ పార్టీలకు చెందిన కొందరు నేతలు ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్ లు ఈ ప్రయత్నంలో ముందున్నారనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

పంజాబ్ ఎన్నికల పలితాల తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ కూటమిపై నమ్మకం లేదన్నారు. దేశంలోని 130 కోట్ల మందితో కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నానని ఆయన చెప్పారు. కేసీఆర్ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఒకరిని గద్దె దింపేందుకో మరొకరిని గద్దె ఎక్కించేందుకు కూటమిగా ఏర్పాటు చేయడానికి తాను వ్యతిరేకమని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు అవసరమన్నారు. 

రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్ధిని బరిలోకి దింపే విషయమై విపక్షాలతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే చర్చిస్తున్నారు. ఇదే సమయంలో మమత బెనర్జీ విపక్షాలతో సమావేశం నిర్వహించడం కాంగ్రెస్ కు రాజకీయంగా మింగుడు పడడం లేదు. మమత బెనర్జీ నిర్వహించే సమావేశానికి కాంగ్రెస్ పార్టీ హాజరు కానుంది.