Mamata Banerjee: మంత్రులు, ఎమ్మెల్యేలకు మమతా బెనర్జీ బంపర్ ఆఫర్.. భారీగా జీతం పెంపు..
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలకు శుభవార్త చెప్పారు. బెంగాల్ రాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలు పెంచుతూ సీఎం మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు.

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలకు శుభవార్త చెప్పారు. తన కేబినెట్ మంత్రులు, ఇతర మంత్రులు, శాసనసభ్యుల వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇక, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చాలా కాలంగా వేతనం తీసుకోవడం లేదు. ఇప్పుడూ కూడా ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. వాస్తవానికి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యేల వేతనాలు చాలా తక్కువనీ, అందుకే వారి వేతనాలను పెంచాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నిర్ణయంతో ఎమ్మెల్యేలు, మంత్రులు, కేబినేట్ మంత్రుల నెలవారీ వేతనం రూ.40,000 పెరిగింది.
ఈ ప్రకటన అనంతరం.. శాసనసభ్యుల నెల జీతం రూ.10,000 నుంచి ఇప్పుడు రూ.50 వేలకు పెరగనున్నాయి. మంత్రుల నెలసరి వేతనం రూ.10,900 నుంచి రూ.50,900 లకు, కేబినెట్ మంత్రుల వేతనం రూ.11,000 నుంచి రూ.51,000లకు పెరగనున్నది. కేబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు, శాసనసభ సభ్యులు వారి నెలవారీ జీతంతో పాటు ఇతర ప్రయోజనాలను పొందుతారని ప్రభుత్వం తెలిపింది. శాసనసభ్యుల నెలవారీ జీతాల ఆదాయం ఇతర అలవెన్సులతో కలిపి రూ.81,000 నుంచి రూ.1.21 లక్షలకు పెరగనుంది.
అదేవిధంగా ఇక నుంచి మంత్రుల నెలసరి వేతన ఆదాయం రూ.1.10 లక్షల నుంచి రూ.1.50 లక్షలకు పెరగనుంది. గురువారం రాష్ట్ర అసెంబ్లీలో జీతాల పెంపును ప్రకటించిన ముఖ్యమంత్రి.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్‌లో శాసనసభ్యుల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని పరిగణనలోకి తీసుకుని శాసనసభ్యుల జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా డియర్‌నెస్ అలవెన్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల పెంపుతో ప్రభుత్వ ఉద్యోగుల్లో కలవరం రేగుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.