పశ్చిమ బెంగాల్ టెట్ ఫలితాల్లో ఆసక్తికరమైన పేర్లు కనిపించాయి. మమతా బెనర్జీ, అమిత్ షా, సువేందు అధికారి, ఇతర పేర్లు చర్చనీయాంశం అయ్యాయి. రాజకీయ నేతలతో అభ్యర్థుల పేర్లు పోలి ఉండటంతో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష బీజేపీ విమర్శలు చేయడంతో ఈ చర్చ పెద్దదైంది. కానీ, రాజకీయ నేతల పేర్ల పోలి ఉండటం యాదృచ్ఛికం అని, వారికి, వీరికి సంబంధం లేదని ప్రభుత్వం తెలిపింది. 

కోల్‌కతా: పేరుతో పనేముంది అనే షేక్స్‌పియర్ కోట్ కొన్ని సార్లు ప్రాసంగికతను కోల్పోతాయి. ఇందుకు ఉదాహరణ పశ్చిమ బెంగాల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష క్లియర్ చేసిన అభ్యర్థుల జాబితా. టీచింగ్ జాబ్‌ల కోసం క్వాలిఫై అయిన వారి జాబితాలో ప్రముఖ రాజకీయ నేతల పేర్లు దర్శనమిచ్చాయి. మమతా బెనర్జీ, దిలీప్ ఘోష్, సుజన్ చక్రబోర్తి, సువేందు అధికారి వంటి పేర్లూ ఈ టీచర్స్ రిక్రూట్‌మెంట్ లిస్టులో కనిపించాయి. అమిత్ షా పేరు కూడా కనిపించింది. అయితే, ఈ పేర్లు రాజకీయ నేతల పేర్లు కావని, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) క్లియర్ చేసిన అభ్యర్థులవేనని, ఈ పేర్ల పోలిక కేవలం యాధృచ్ఛికమే అని వెస్ట్ బెంగాల్ బోర్డ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ (డబ్ల్యూబీబీపీఈ) స్పష్టం చేసింది.

కానీ, ఈ అంశాన్ని లేవనెత్తుతూ బీజేపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించింది. పశ్చిమ బెంగాల్‌లో విద్యా ప్రమాణాలకు ఇది ఉదాహరణ, రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సుకాంత మజుందార్ ట్వీట్ చేశారు. అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుకోవడాన్ని మమతా బెనర్జీ ఎప్పుడు మానుకుంటారు? అంటూ ప్రశ్నించారు. 

కాగా, ఇందులో పొరపాటు ఏమీ లేదని, ఆ పేర్లు రాజకీయ నేతల పేర్లు తప్పిదంగా పడలేవని, నిజంగా టెట్ క్లియర్ చేసిన అభ్యర్థుల పేర్లే అని డబ్ల్యూబీబీపీఈ స్పష్టం చేసింది. డబ్ల్యూబీబీపీఈ చైర్మన్ గౌతమ్ పాల్ మాట్లాడుతూ, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్‌లు ఉంటున్నాయని, ఆ అభ్యర్థులకు ఫోన్లు చేసి ఎందుకు అడగరు? అంటూ ప్రశ్నించారు. వారి ఫొటోలు పంపాలని అడగండి.. లేదా ఈ పేరు వారిదేనా? కాదా? అని కూడా అడగండి అంటూ ఎదురుదాడి చేశారు. 

Also Read: సీఏఏ అనేది ఓ అబద్ధం.. బీజేపీపై విరుచుకపడ్డ మమతా బెనర్జీ

ఈ జాబితాలో అమిత్ షా పేరు కూడా ఉన్నదని వివరించారు. ఆయన వివరాలు ఇవ్వాలని, తాను అది వాస్తవమేనా? కాదా? కూడా చెబుతా అని తెలిపారు. మమతా బెనర్జీ పేరు కూడా ఈ జాబితాలో ఉన్నదని గుర్తు చేయగా.. ఆ పేరుతో ఒక అభ్యర్థి ఉన్నారని ఆయన చెప్పారు. తాను ఆ అభ్యర్థికి కాల్ చేశానని వివరించారు. ఆమె తండ్రిపేరు మధురనాథ్ బెనర్జీ అని చెప్పినట్టు వివరించారు. మీరు కూడా ఆమెకు ఫోన్ కాల్ చేస్తే మీకే ఆ వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

టెట్ క్లియర్ చేసిన అభ్యర్థుల జాబితాలో కొందరు ప్రముఖల పేర్లతో పోలే పేర్లు ఉన్నంత మాత్రానా వారు ఆ రాజకీయ నేతలే కారని, వారంతా అభ్యర్థులే అని స్పష్టం చేశారు.