తాను కాంగ్రెస్ అధ్యక్షుడిగా విజయం సాధించడంలో సహకరించిన పార్టీ శ్రేణులకు మల్లిఖార్జున ఖర్గే కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్‌లో చిన్నా, పెద్దా ఎవ్వరూ లేరని కార్యకర్తగా ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు

కాంగ్రెస్‌లో చిన్నా, పెద్దా ఎవ్వరూ లేరని కార్యకర్తగా ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ నూతన అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే. అధ్యక్ష ఎన్నికల ఫలితం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశంలో మత విద్వేషాలు, హింస, దాడులు పెరిగాయన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న ఆయన.. రాజ్యాంగంపై జరుగుతోన్న దాడిని ఉమ్మడిగా ఎదుర్కోవాల్సిన అవసరం వుందని పిలుపునిచ్చారు. తాను విజయం సాధించడంలో సహకరించిన పార్టీ శ్రేణులకు ఖర్గే కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకుముందు ఖర్గేకు ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీలు అభినందనలు తెలిపారు. 

కాగా... కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఈ నెల 17న పోలింగ్ జరగగా.. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఎన్నికలో శశి థరూర్‌పై మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు. మల్లికార్జున ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, శశి థరూర్‌కు 1,072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. ఈ మేరకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

ALso REad:కార్మిక నేత నుంచి కాంగ్రెస్ చీఫ్ వరకు.. నూతన అధ్యక్షుడు ఖర్గే ప్రస్థానం ఇదీ..!

80 ఏళ్ల మల్లికార్జున్ ఖర్గే ఉన్నత నేతగా ఎదిగిన దళితుడు. కాంగ్రెస్ పార్టీకి దళిత నేత అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడం ఇది రెండోసారి. తొలిసారి జగ్జీవన్ రామ్ ఈ పార్టీకి అధ్యక్షుడయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు దళిత అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. 1942 జులై 21న జన్మించిన ఖర్గే 1969లో కాంగ్రెస్‌లో చేరారు. చివరిసారి ఆయన 2021 ఫిబ్రవరి 16న పార్లమెంటులో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ నెల 1వ తేదీ వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ హయాంలో ఆయన కార్మిక, ఉపాధి శాఖ, రైల్వే శాఖ మంత్రిగా.. 2014 నుంచి 2019 వరకు లోక్‌సభాపక్ష నేతగా ఉన్నారు.