Belagavi: కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేవలం పేరుకు మాత్రమే అధ్యక్షుడనీ, అసలు రిమోట్ కంట్రోల్ ఎవరి వద్ద ఉందో అందరికీ తెలుసని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. మల్లికార్జున ఖర్గేను తాను గౌరవిస్తానని చెబుతూ.. ఆయనను ఇలా చూడటం బాధగా ఉందని తెలిపారు.
Prime Minister Modi criticized the Congress: ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేరును ప్రస్తావిస్తూ పరోక్షంగా సోనియా గాంధీపై విమర్శలు దాడి చేశారు. మల్లిఖార్జున ఖర్గే పేరుకు మాత్రమే పార్టీ చీఫ్ అనీ, రిమోట్ కంట్రోల్ మరొకరి వద్ద ఉందని కాంగ్రెస్ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ ప్లీనరి సమావేశాల్లో ఒకే వేదికను పంచుకున్న సోనియా గాంధీ గొడుగు కింద నిలబడి ఉండగా, మల్లికార్జున ఖర్గే సహా పలువురు నాయకులు ఎండలో నిలుచుని ఉన్నారు. ఈ ఫొటోలను ప్రస్తావిస్తూ ప్రధాని కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు.
వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని బెళగావిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకకు చెందిన నేతలను కాంగ్రెస్ అవమానిస్తోందని ఆరోపించారు. కర్ణాటకను కాంగ్రెస్ ఎలా ద్వేషిస్తుందో గుర్తు చేయాలనుకుంటున్నానని పలు అంశాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ ను ఎవరు ఇబ్బంది పెట్టినా వారిని అవమానించడం మొదలుపెడతారనీ, ఎస్ నిజలింగప్ప, వీరేంద్ర పాటిల్ లను కాంగ్రెస్ కుటుంబం ఎలా అవమానించిందో దానికి చరిత్రే నిదర్శనమంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేవలం పేరుకు మాత్రమే కాంగ్రెస్ అధ్యక్షుడనీ, దాని రిమోట్ కంట్రోల్ ఎక్కడ ఉందో అదరికీ తెలుసునని పేర్కొన్నారు.
ఇటీవల రాయ్ పూర్ లో కాంగ్రెస్ 85 ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఈ క్రమంలోనే ఒకే వేదికను పంచుకున్న మల్లికార్జున ఖర్గే ఎండలో నిలబడి ఉండగా, సోనియా గాంధీకి ఒకరు గొడుకు పట్టుకుని కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ప్రస్తావిస్తూ ప్రధాని పరోక్షంగా సోనియా గాంధీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్లీనరీలో సోనియా గాంధీతో కలిసి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండాను ఎగురవేసిన నేపథ్యానికి సంబంధించిన ఫొటోలు అవి.
'మల్లిఖార్జున ఖర్గేను నేను గౌరవిస్తాను. కానీ ఖర్గే లాంటి సీనియర్ నేత కాంగ్రెస్ సమావేశాల్లో ఎండలో నిలబడినా గొడుగు నీడను సైతం ఇవ్వకపోవడం బాధ కలిగించింది. అయితే, ఇదే సమయంలో మరొకరికి గొడుగు నీడ దొరికింది. అంటే ఖర్గే కేవలం నామమాత్రానికే కాంగ్రెస్ అధ్యక్షుడు అని అర్థం. కానీ రిమోట్ కంట్రోల్ ఎవరికి ఉందో ప్రపంచానికి తెలుసు' అని పరోక్షంగా ప్రధాని మోడీ.. సోనియా గాంధీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
కాగా, కర్నాటక పర్యటనలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) కింద 13 వ విడత మొత్తాన్ని 8 కోట్లకు పైగా లబ్ధిదారులకు ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ ద్వారా ప్రధాని మోడీ విడుదల చేశారు. 2014లో తాము అధికారంలోకి వచ్చినప్పుడు వ్యవసాయ బడ్జెట్ రూ.25,000 కోట్లు కాగా, ఈ ఏడాది అది రూ.1,25,000 కోట్లకు పెరిగిందన్నారు. ఇది బడ్జెట్ లో 5 రెట్లు అధికమని తెలిపారు. దేశంలో చిన్న రైతులు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురయ్యారని గత పరిస్థితులను గుర్తు చేశారు. "దేశంలో 80 శాతం మంది చిన్న రైతులు ఉన్నారు, వారికి ఇప్పుడు బీజేపీ ప్రాధాన్యత ఇస్తోంది. 2.5 లక్షల కోట్లను చిన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో వారికి ఆర్థిక సాయం జమ చేశామని" ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.
