లోక్‌సభలో భద్రతా లోపం.. సందర్శకుల గ్యాలరీనుంచి లోపలికి దూకిన ఆగంతకులు..

బుధవారం లోక్‌సభలోకి ఆగంతకులు చొరబడ్డారు. విజిటర్స్ గ్యాలరీనుంచి లోపలికి దూకారు. ఈ సమయంలో ప్రధాని మోడీ సభలో లేరు.  

Major security breach in the Lok Sabha, Bystanders jumped from visitors' gallery - bsb

ఢిల్లీ : లోక్ సభలో సెక్యూరిటీని తప్పించుకుని ఇద్దరు ఆగంతకులు సభలోకి దూకారు. లోక్ సభ్ గ్యాలరీనుంచి బెంచీల మీదుగా దూకుతూ సభలోకి ప్రవేశించారు. వెంటనే గాల్లోకి టియర్ గ్యాస్ వదిలారు. వారిని గమనించిన ఎంపీలు పట్టుకోవడానికి ప్రయత్నించారు. వారు తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన లోక్ సభ సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 

గ్యాలరీలోనుంచి లోక్ సభలోకి దూకిన వీరిని చూసి ఎంపీలు భయంతో పరుగులు పెట్టారు. దుండగులు సభలోకి దూరి టియర్ గ్యాస్ వదిలిన ఫొటో ఒకటి వెలుగు చూసింది. నిందితుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్టుగా సమాచారం. నిందితులు పది అడుగుల ఎత్తైన గోడమీదినుంచి దూకి మరి సభలోకి ప్రవేశించారు. వీరిలో ఒకరి పేరు ప్రసాద్ గా గుర్తించారు. మహిళ పేరు నీలంగా గుర్తించారు. ఆగంతకులు షూలో టియర్ గ్యాస్ అమర్చుకుని విజిటర్స్ గ్యాలరీలోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఉండే పార్లమెంటులోకి వీరిద్దరు ఎలా వచ్చారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఈ సమయంలో అసెంబ్లీలో జీరో అవర్ జరుగుతుంది. ఘటన నేపథ్యంలో వెంటనే స్పీకర్ సభను వాయిదా వేశారు. విజిటర్స్ గ్యాలరీలోకి రావాలన్నా కూడా ఎంపీ రికమండేషన్, లేదా పార్లమెంట్ అధికారుల అనుమతి ఉండాలి. మరి వీరిద్దరికి ఎవరు అనుమతి ఇచ్చారో అనే కోణంలో భద్రతా సిబ్బంది పరిశీలిస్తున్నారు. ఆగంతకులు పార్లమెంటులోకి ప్రవేశించిన సమయంలో ప్రధాని మోడీ, అమిత్ షాలు సభలో లేరు. రాహుల్ గాంధీతో సహా మిగతా నేతలందరూ ఉన్నారు. 

ఈ ఘటనపై అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. 'ఇద్దరు యువకులు గ్యాలరీ నుంచి దూకారు. టియర్ గ్యాస్‌ వెదజల్లుతూ ఏదో వస్తువు విసిరారు. వారిని ఎంపీలు పట్టుకున్నారు, భద్రతా సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. 2001 (పార్లమెంటు దాడి)లో తమ ప్రాణాలను త్యాగం చేసిన వ్యక్తుల వర్ధంతిని ఈ రోజు జరుపుకుంటున్నాం. ఈ సమయంలో ఈ ఘటన ఖచ్చితంగా భద్రతా ఉల్లంఘనే..." అన్నారు. 

ఈ ఘటన నేపథ్యంలో పార్లమెంట్ పరిసరాలనుంచి ఎవరినీ బైటికీ, లోపలికీ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వీరిద్దరి గురించి ఆరా తీస్తున్నారు. 

2001లో ఇదే రోజు పార్లమెంట్ పై దాడి జరిగింది. దాదాపు 22యేళ్ల తరువాత మళ్లీ సరిగ్గా అదేరోజు పార్లమెంటుపై దాడి జరగడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ సమయంలో ఐదుగురిని భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios