హైదరాబాద్‌లోని సాలర్‌జంగ్ మ్యూజియం, ఢిల్లీలోని ప్రగతి మైదాన్ సహా దేశంలోని ప్రతిష్టాత్మక భవనాలకు రూపకల్పన చేసిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ మహేంద్ర రాజ్ కన్నుమూశారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.  

భారతీయ ఆర్కిటెక్ట్ రంగంలో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ ఆర్కిటెక్ట్ మహేంద్ర రాజ్ (Mahendra Raj) కన్నుమూశారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ (Pragati Maidan) , హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియం (Salarjung Museum) , అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ వంటి భవనాలతో పాటు స్వతంత్ర భారతదేశంలోని అనేక అధునాతన, ఐకానిక్ భవనాలకు మహేంద్ర రాజ్ రూపకర్తగా వ్యవహరించారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం ఆయన కన్నుమూశారు. మహేంద్ర వయసు 97 సంవత్సరాలు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని లోధి స్మశాన వాటికలో మహేంద్ర రాజ్ అంతక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

మహేంద్ర రాజ్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 70వ దశకం నుంచి 80వ దశకం మధ్యలో ఈ దేశంలో నిర్మించిన ప్రముఖ భవనాలపై మహేంద్ర రాజ్ ముద్ర ఉంది. ఆర్కిటెక్ట్ దృష్టిని భవన రూపంలో ఎలా వ్యక్తీకరించాలో ఆయనకి తెలుసని ప్రముఖ ఆర్కిటెక్ట్ అండ్ అర్బన్ డిజైనర్ కేటీ రవీంద్రన్ కొనియాడారు. మహేంద్ర రాజ్ మరణం దేశానికి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటన్నారు. 

మహేంద్ర రాజ్, 1946లో అవిభక్త భారత్‌లోని లాహోర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. విద్యాభ్యాసం తర్వాత పంజాబ్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ బిల్డింగ్స్ అండ్ రోడ్స్‌లో ఉద్యోగంలో చేరారు. అనంతరం చండీగఢ్‌లోని లే కార్బూసియర్ భవనాలపై పనిచేస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా ప్రమోషన్ అందుకున్నారు. ఆర్కిటెక్ట్ రంగంలో ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ వెళ్లి అమ్మన్ విట్నీ కన్సల్టింగ్ ఇంజనీర్స్‌లో 1959 వరకు విధులు నిర్వర్తించారు. తిరిగి భారతదేశానికి వచ్చి ముంబైలో మహేంద్ర రాజ్ కన్సల్టెంట్‌‌ను ప్రారంభించారు. 2002లో ఇంజినీరింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మహేంద్ర రాజ్ కీలకపాత్ర పోషించారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కన్సల్టింగ్ ఇంజనీర్స్‌లో సభ్యుడిగా పని చేశారు. ఆర్టిటెక్ట్‌గా ప్రఖ్యాత భవనాలకు రూపకల్పన చేసిన మహేంద్ర రాజ్ సేవలకు గాను పలు అవార్డులు, రివార్డులు గెలుచుకున్నారు.