మహాత్మా గాంధీ జయంతి.. అక్టోబర్ 1న గంట పాటు శ్రమదానం చేయాలని దేశ ప్రజలకు ప్రధాని పిలుపు
వచ్చే అక్టోబర్ 1వ తేదీన గంట పాటు దేశ ప్రజలందరూ శ్రమధానం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. తమ పరిసరాల్లో, పార్కుల్లో, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 1వ ఉదయం 10 గంటలకు పరిశుభ్రత కోసం గంటపాటు శ్రమదానం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ సేవా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. మన్ కీ బాత్, వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రస్తావించారు. ‘‘మీరు మీ వీధిలో లేదా పరిసరాలలో, పార్కు, నది, సరస్సు, లేదా మరేదైనా బహిరంగ ప్రదేశంలో కూడా ఈ పరిశుభ్రత ప్రచారంలో పాల్గొనవచ్చు. అమృత్ సరోవర్ నిర్మించిన ప్రతిచోటా పరిశుభ్రత చేపట్టాలి’’ అని ప్రధాని అన్నారు.
కాగా.. ఏక్ తారీఖ్ ఏక్ ఘంటా ఏక్ సాథ్ (వన్ డేట్ వన్ అవర్ టుగెదర్) అని పిలిచే ఈ క్యాంపెయిన్ లో భాగస్వాములు కావాలని గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్కెట్ స్థలాలు, రైల్వే ట్రాక్ లు, నీటి వనరులు, పర్యాటక ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలు వంటి బహిరంగ ప్రదేశాలను శుభ్రపరిచే కార్యకలాపాల్లో అన్ని వర్గాల పౌరులు పాల్గొనాలని కోరింది. గ్రామ పంచాయితీ, పౌర విమానయానం, రైల్వేలు, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ప్రభుత్వ సంస్థలు వంటి ప్రభుత్వానికి చెందిన అన్ని రంగాలు పౌరుల నేతృత్వంలో పరిశుభ్రత కార్యక్రమాలను సులభతరం చేస్తాయని తెలిపింది.
ఈ క్యాంపెయిన్ కోసం swachhtahiseva.com వెబ్ సైట్ ను కూడా రూపొందించామని, అక్కడ అన్ని కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. డ్రైవ్ చేపట్టే ప్రదేశాలను ప్రభుత్వ సంస్థలు ప్రచురించనున్నాయి.స్వచ్ఛంద సంస్థలు, ఆర్ డబ్ల్యూఏలు, ప్రైవేట్ సంస్థలు కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడానికి జిల్లా యంత్రాంగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వలంటీర్లు తమ కార్యకలాపాలను ఫొటోలు తీసి సైట్లో అప్లోడ్ చేయవచ్చు.
కాగా.. ఈ క్యాంపెయిన్ ను ప్రభుత్వ సంస్థలు సోషల్ మీడియా, ఇన్ ఫుయెన్సన్లు, బ్రాండ్ అంబాసిడర్ల ప్రమోట్ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి ఇంటి వ్యర్థాలను సేకరించడానికి ఉపయోగించే చెత్త వ్యాన్లు ప్రకటనలు, జింగిల్స్ ప్లే చేయనున్నాయి. ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రత్యేక మొబైల్ కాలర్ ట్యూన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా.. ప్రధాని మోడీ ప్రారంభించిన స్వచ్ఛభారత్ మిషన్ తొమ్మిదో వార్షికోత్సవం అక్టోబర్ 2న జరగనుంది.