ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాల పేర్లు మార్చిన మహా సర్కార్.. ఇక నుంచి వాటిని ఏమని పిలవాలంటే ?
మహారాష్ట్రలోని రెండు జిల్లాల పేర్లు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శనివారం ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో ఇక ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాల పేర్లు కనుమరుగు కానున్నాయి. ఇక నుంచి వాటిని ఏమని పిలవాలి అనే విషయంలో ప్రభుత్వం తన నోటిఫికేషన్ లో స్పష్టతను ఇచ్చింది.

ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాల పేర్లను మారుస్తూ ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. కొన్ని నెలల క్రితం నుంచి ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సబ్ డివిజన్, గ్రామ, తాలూకా, జిల్లా స్థాయిల్లో పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ శాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది.
కొత్త ఉత్తర్వుల ప్రకారం ఔరంగాబాద్ జిల్లా ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాగా, ఉస్మానాబాద్ జిల్లా ధారాశివ్ జిల్లాగా మారిపోయింది. ఇక నుంచి అధికారికంగా ఆయా పేర్లతోనే పిలవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉత్తర, ప్రత్యుత్యారాలలో, అధికారిక కార్యక్రమాల్లో ఇక నుంచి శంభాజీనగర్, ఉస్మానాబాద్ జిల్లాల పేర్లు కనిపించనున్నాయి.
వాస్తవానికి షిండే, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల తిరుగుబాటుతో గతేడాది జూన్ 29న అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడానికి ముందు జరిగిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ చివరి మంత్రివర్గ సమావేశంలో ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఒక రోజు తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ప్రదేశాల పేర్లను మార్చడం చట్టవిరుద్ధమని, రాష్ట్ర అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ కోరారు. దీంతో ఇంత కాలం ఆ పేర్లు మార్చే ప్రక్రియ వాయిదా పడింది.
కాగా.. ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లను వరుసగా ఛత్రపతి శంభాజీనగర్, ధారాశివ్ గా మార్చేందుకు షిండే కేబినెట్ 2022 జూలైలో ఆమోదం తెలిపింది. ఎంవీఏ ప్రభుత్వ చివరి కేబినెట్ సమావేశంలో ఔరంగాబాద్ పేరును శంభాజీనగర్ గా మాత్రమే అనుకున్నారు. కానీ షిండే ప్రభుత్వం దానికి 'ఛత్రపతి' అనే పూర్వపదాన్ని జోడించింది.