Asianet News TeluguAsianet News Telugu

ఇప్పటికీ నేనే సీఎం అనిపిస్తున్నది: ప్రతిపక్ష నేత.. కౌంటర్ ఇచ్చిన అధికారపక్షం

గత హయాంలో ఐదేళ్లు మహారాష్ట్ర సీఎంగా కొనసాగిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లు ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న ఆయన ఇప్పటికీ తానే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫీల్ అవుతున్నట్టు తెలిపారు. ఈ వ్యాఖ్య అధికారపక్షానికి ఆగ్రహం తెప్పించింది. ఎన్సీపీ నేత శరద్ పవార్ దేవేంద్ర ఫడ్నవీస్‌కు కంగ్రాట్స్ అని చెబుతూ కౌంటర్ ఇచ్చారు. 

maharastra oppostition leader says he still feels as CM
Author
Mumbai, First Published Oct 14, 2021, 1:15 PM IST

ముంబయి: ఆయన 2014 నుంచి ఐదేళ్లు మహారాష్ట్ర(Maharstra) సీఎం(CM)గా పనిచేశాడు. 2019లో ఫలితాలు కలిసిరాలేదు. మిత్రపక్షంతో ఈక్వేషన్స్ కుదరలేదు. ఇప్పుడు అపోజిషన్ సీటులో కూర్చున్నాడు. ప్రతిపక్ష నేతగా దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్నాడు. అయినప్పటికీ మాజీ సీఎం, బీజేపీ(BJP) నేత దేవేంద్ర ఫడ్నవీస్‌(Devendra Fadnavis)కు ఇంకా తానే ముఖ్యమంత్రి అన్నట్టుగా అనిపిస్తున్నదని అన్నారు. ఈ వ్యాఖ్యలు అధికారపక్షానికి ఆగ్రహం తెప్పించింది. వెంటనే ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్(Sharadh Pawar) కౌంటర్ ఇచ్చారు. వ్యంగ్యంగా ఆయనకు కంగ్రాట్స్ చెప్పారు.

నవి ముంబయిలోని ఓ కార్యక్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఇప్పటికీ ముఖ్యమంత్రిగానే ఫీల్ అవుతున్నాను. గత రెండేళ్లుగా రాష్ట్రమంతా తిరుగుతున్నాను. ప్రజలు చూపించే ప్రేమ, అనురాగంలో ఏమాత్రం లోటు కనిపించలేదు’ అని అన్నారు. 

Also Read: కేంద్ర మంత్రిపై శరద్ పవార్ ప్రశంసలు.. ‘అధికారాన్ని ఎలా ఉపయోగించాలో ఆయనకు బాగా తెలుసు’

ఈ వ్యాఖ్యలకు శరద్ పవార్ కౌంటర్ ఇచ్చారు. ‘ఆ బీజేపీ నేత ఇప్పటికీ ముఖ్యమంత్రిగా పరిగణించుకోవడం మంచిదే. ఆయనకు కంగ్రాట్స్ కూడా చెబుతున్నాను. ఐదేళ్లు సీఎంగా చేసిన ఫడ్నవీస్ ఇంకా అదే పదవిలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. కానీ, నాకు ఈ గుణాలు వెంటరాలేదు. నేను మహారాష్ట్రకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాను. కానీ, నాకు ఆ విషయమే ఇప్పుడు గుర్తు లేదు’ అని అన్నారు.

శరద్ పవార్ ఇచ్చిన కౌంటర్‌కు దేవేంద్ర ఫడ్నవీస్ రీకౌంటర్ ఇచ్చారు. ‘నేను గత హయాంలో విజయవంతంగా ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించినందుకు కొందరు నేతలకు గిట్టడం లేదు’ అని అన్నారు. ‘నా పూర్తి ప్రసంగం వినకుండానే నాపై నోరుపారేసుకున్నారు. వాస్తవమేమిటంటే మహారాష్ట్రలో గత 40 ఏళ్లుగా ఏ సీఎం కూడా ఐదేళ్లు విజయవంతంగా ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించలేదు. శరద్ పవార్ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. కానీ, ఎప్పుడూ ఆయన ఐదేళ్లు సీఎంగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టలేదు’ అని అన్నారు. 

మహారాష్ట్రలో బంద్‌ను ప్రకటించిన శివసేన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో ఘటన జరిగితే మహారాష్ట్రలో బంద్ పెట్టారని ఆగ్రహించారు. రాష్ట్రంలో బంద్ సక్సెస్ కావడానికి అధికార యంత్రాంగాన్ని వినియోగించిందని, శివసేన వర్కర్లు షాప్ ఓనర్లపై బెదిరింపులకు పాల్పడి షాప్‌లు బంద్ చేయించారని ఆరోపించారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత అణచివేత అని, తద్వార ప్రజలు ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే భయపడ్డారని అన్నారు.

Also Read: Lakhimpur Kheri: 24 గంటలపాటు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన ప్రభుత్వం.. వివరాలివే

2014లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ, శివసేన కూటమిగా ఏర్పడి అధికారాన్ని చేపట్టింది. అప్పుడు  దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా కొనసాగారు. ఐదేళ్లు పూర్తిస్థాయిలో దేవేంద్ర ఫడ్నవీస్ బాద్యతలు చేపట్టారు. కానీ, 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఆ కూటమి నిలువలేకపోయింది. సీఎం కుర్చీపై పేచీతో శివసేన బయటికి వెళ్లడానికి సిద్ధపడింది. అప్పుడు ఎన్సీపీ నేత అజిత్ పవార్‌ను కలిసి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా కొనసాగుదామనుకున్నారు. అది రెండు రోజులకు మించి సాగలేదు. అజిత్ పవార్ వెనక్కి వెళ్లడం, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు కలిసి మహావికాస్ అఘాది ప్రభుత్వ ఏర్పాటు చకచకా జరిగిపోయాయి. ఈ కూటమితో శివసేన పూర్తిస్థాయి సీఎంగా కొనసాగే అవకాశం ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పొందగలిగారు.

Follow Us:
Download App:
  • android
  • ios