Omicron Variant: మహారాష్ట్రలో కోలుకున్న ‘ఒమిక్రాన్’ బాధితుడు
దక్షిణాఫ్రికాలో గత నెలలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ Omicron భయాందోళనలు కొనసాగుతున్నాయి. భారత్‌లోనూ ఈ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో Omicron Variant బారినపడిన ఓ వ్యక్తి కోలుకున్నాడు. ఈ విషయాన్ని గురువారం ఉదయం మహారాష్ట్ర అధికారులు వెల్లడించారు.
Omicron Variant: భారత్‌లో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా భావిస్తున్న ఒమిక్రాన్ కేసులు సైతం దేశంలో నమోదుకావడం కలవరం రేపుతున్నది. అయితే, మన దేశంలో నమోదైన మొదటి ఒమిక్రాన్ వేరియంట్ బాధితుడు కోలుకున్నాడని గురువారం ఉదయం మహారాష్ట్ర అధికారులు వెల్లడించారు. బుధవారం నాడు నిర్వహించిన కోవిడ్-19 పరీక్షల్లో నెగెటివ్‌గా వచ్చిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశామని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన 33 సంవత్సరాల ఓ వ్యక్తి కల్యాణ్‌లోని డోంబివిలి మున్సిపల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆయన మెరైన్ ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నవంబర్ 24న దక్షిణాఫ్రికా నుంచి దుబాయికి చేరుకున్నాడు. అటు నుంచి దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాడు.
Also Read: Bipin Rawat:త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి.. యుద్ధవీరుడి జీవిత విశేషాలు..
ఒమిక్రాన్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారికి ప్రభుత్వం కరోనా పరీక్షలు తప్పని సరి చేసింది. వారిని వారం రోజుల పాటు క్వారంటైన్ ఉండాలనే మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మెరైన్ ఇంజినీర్‌కు కరోనా వైరస్ ఆర్టీ పీసీఆర్ పరీక్షల నిర్వహించారు. అయితే, పరీక్ష ఫలితాలు వచ్చేలోపు ఆయన ముంబయికి వెళ్లాడు. కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వెంటనే ఈ విషయాన్ని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఆ ఇంజినీర్ కు తెలియజేశారు. అలాగే, ప్రభుత్వ అధికారులకు సైతం సమాచారం అందించారు. ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో అప్రమత్తమైన మహారాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు అతని స్వాబ్ నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. అక్కడ పరీక్షల అనంతరం అతనికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని నిర్ధారించారు. అలాగే, మెరైన్ ఇంజినీర్ పనిచేస్తున్న ఆ వ్యక్తి గత ఏప్రిల్‌లో నుంచి సముద్ర ప్రయాణలోనే ఉన్నాడనీ, దీని కారణంగా అతను కరోనా టీకాలు సైతం తీసుకోలేదని అధికారులు తెలిపారు.
Also Read: Framers Protest: తక్షణమే కేసులు ఎత్తేస్తాం.. రైతులకు కేంద్రం కొత్త ఆఫర్ !
Omicron Variant గురించి కల్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) కమిషనర్ డాక్టర్ విజయ్ సూర్యవంశీ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఆ మెరైన్ ఇంజినీర్‌కు ఒమిక్రాన్ సోకినట్టు గత నెలలోనే నిర్ధారించారని తెలిపారు. దీంతో ఆయనను కల్యాణ్‌లోని కోవిడ్-19 కేర్ సెంటర్‌లో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన క్వారంటైన్ లో ఉన్నారు. ఇక బుధవారం ఆయనకు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించామనీ, ప్రస్తుత ఫలితాల్లో నెగటివ్ వచ్చిందని తెలిపారు. దీంతో అతన్ని కోవిడ్ కేర్ సెంటర్ నుంచి డిశ్చార్జి చేశామని సూర్యవంశీ వెల్లడించారు. కరోనా వైరస్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలనీ, వారం రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సదరు వ్యక్తికి సూచించామని చెప్పారు. ఇదిలావుండగా, ఒమిక్రాన్ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అక్కడ ఇప్పటివరకు మొత్తం 10 ఓమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసులు, మరణాల్లో అధికం మహారాష్ట్రలోనే నమోదైన సంగతి తెలిసిందే.
Also Read: Vizag steel plant protest : విశాఖ ఉక్కు ఉద్యమానికి 300 రోజులు.. నేడు భారీ ధర్నా