ముంబై: ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స పొందుతున్న కరోనా రోగి బుధవారం నాడు రాత్రి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో మరణించాడు.ఆయన వయస్సు 53 ఏళ్లు. ఆయన ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన చనిపోయాడు.

కరోనా చికిత్స కోసం ప్లాస్మా థెరపీ ద్వారా ఆయనకు చికిత్స నిర్వహించారు. అయినా కూడ నాలుగు రోజులుగా ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల రాలేదని వైద్యులు చెప్పారు

గత నెల 25వ తేదీన 200 ఎంఎల్ డోస్ ఫ్లాస్మా ను కరోనా నుండి కోలుకొన్న వ్యక్తి నుండి తీసి ఇచ్చారు. ఫ్లాస్మా థెరపీ ప్రారంభించిన 24 గంటల్లో అతని శరీరంలో మెరుగుదల వచ్చినట్టుగా వైద్యులు తెలిపారు.

అయితే 24 గంటలు దాటిన తర్వాత ఆరోగ్యం విషమించిందని వైద్యులు గుర్తు చేసుకొన్నారు. బుధవారం నాడు రాత్రి 11:30 గంటలకు ఆయన తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో మరణించినట్టుగా వైద్యులు చెప్పారు.

also read:కరోనా ఎఫెక్ట్: ఫేస్ మాస్కులు లేకపోతే నో పెట్రోల్, డీజీల్

ప్లాస్మా థెరపీ ప్రారంభించిన 24 గంటల్లో ఈ రోగి ఆరోగ్యంలో మెరుగుదల రావడంతో ఈ ప్రయోగం విజయవంతమైందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే ప్రకటించిన విషయం తెలిసిందే.

ముంబై లీలావతి ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీ నిర్వహించారు. మొదటి ప్లాస్మా థెరపీ నిర్వహించిన రోగి చనిపోయాడు. ముంబైలోని బివైఎల్ నాయర్ ఆసుపత్రిలో రెండో రోగికి ప్లాస్మా థెరపీ నిర్వహించారు. ప్లాస్మా థెరపీ ప్రయోగం మాత్రమే ఇది అధికారిక చికిత్స కాదని ఐసీఎంఆర్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.