మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో కొవిడ్ నిబంధనలు అన్నింటినీ ఎత్తేస్తున్నట్టు ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. శనివారం నుంచి మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం కూడా తప్పనిసరేమీ కాదని ప్రభుత్వం ప్రకటించింది.
ముంబయి: మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో అన్ని కొవిడ్ ఆంక్షలు ఎత్తేయాలని నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అన్ని కొవిడ్ నిబంధనలు ఎత్తేశాయి. మహారాష్ట్రలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి అన్ని కరోనా నిబందనలు ఎత్తేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు, మహారాష్ట్రంలో శనివారం నుంచి మాస్కు కూడా ధరించాల్సిన అవసరం లేదు. కరోనా కేసులు భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వి పత్తు నిర్వహణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకటన వెలువరించడం గమనార్హం. కాగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని కొవిడ్ నిబందనలు ఎత్తేస్తున్నట్టు తెలిపింది. అయితే, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించే నిబంధనలు అమల్లోనే ఉంటాయని వివరించింది.
మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే మాట్లాడుతూ, రాష్ట్రంలో 700 నుంచి 800 కరోన కేసులు నమోదు అవుతున్నాయని వివరించారు. పాజిటివిటీ రేటు నాలుగు శాతంగా ఉన్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపులు, కొవిడ్ టాస్క్ ఫోర్స్‌తో చర్చించిన తర్వాతే కరోనా నిబంధనల ఎత్తివేత నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 2వ తేదీ (ఉగాది) నుంచి రాష్ట్రంలో ఎపిడెమిక్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ఉపసంహరించుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే, రాష్ట్ర మంత్రి
మండలి నిర్ణయం తీసుకున్నదని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు.
రాష్ట్రంలో మాస్కు ధరించడం కూడా శనివారం నుంచి తప్పనిసరి కాదని, లోకల్ ట్రైన్‌లో ప్రయాణించాలంటే రెండు డోసుల టీకా కచ్చితంగా వేసుకుని ఉండాలనే నిబంధననూ ఎత్తేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే సందర్భంలో మంత్రి రాజేశ్ తోపే కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ ముందు జాగ్రత్తలు తప్పనిసరి కాదు అన్నంత మాత్రానా వాటిని పాటించకుండా ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. అంటే.. భవిష్యత్‌లో మళ్లీ కరోనా సంక్షోభం ఏర్పడకుండా.. మళ్లీ విపత్కర పరిస్థితులు రాకుండా నివారించడానికి ప్రజలు మాస్కు ధరించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. భౌతికం దూరం పాటించాలని, టీకాలనూ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు.
దేశవ్యాప్తంగా కేసులు అదుపులో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఇదే నెలలో కీలక నిర్ణయం తీసుకుంది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ఎత్తేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ నెలాఖరు అంటే మార్చి 31వ తేదీ నుంచి విపత్తు నిర్వహణ చట్టాన్ని ఎత్తేయాలని కేంద్ర హోం వ్యవహారాల శాఖ వెల్లడించింది. కరోనా మన దేశంలోకి ఎంటర్ అయిన తర్వాత కట్టడి నిబంధనల కోసం 2020 మార్చ్ నెలలో తొలిసారి కేంద్ర ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌ను అమలు చేసింది. అప్పటి నుంచి పలుమార్లు దీన్ని పొడిగిస్తూ వచ్చింది. కానీ, ఈ నెలాఖరు వరకు ఈ యాక్ట్ అమల్లో ఉన్నది. కానీ, ఆ తర్వాత ఈ చట్టాన్ని మరికొంత కాలం పొడిగించాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. లాక్‌డౌన్ వంటి అంశాలు ఈ చట్టం కిందకు వస్తాయి. కేంద్ర హోం శాఖ పరిధిలోని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ఎత్తేసినప్పటికీ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అమలు చేస్తున్న మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి గైడ్‌లైన్స్ మాత్రం అమల్లోనే ఉంటాయని ఆయన తన లేఖలో వివరించారు.
