సారాంశం

Mumbai Rains: మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో పిడుగుపాటుకు గురైన‌ ఐదుగురు మృతి చెందారు. భారీ వర్షాల మధ్య మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో వేర్వేరు పిడుగుపాటు ఘ‌ట‌న‌ల్లో ఐదుగురు మృతి చెందారనీ, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మ‌రికొన్నిరోజులు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. 
 

Lightning strike kills 5 in Chandrapur: మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో పిడుగుపాటుకు గురైన‌ ఐదుగురు మృతి చెందారు. భారీ వర్షాల మధ్య మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో వేర్వేరు పిడుగుపాటు ఘ‌ట‌న‌ల్లో ఐదుగురు మృతి చెందారనీ, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మ‌రికొన్నిరోజులు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) పేర్కొంది.

వివ‌రాల్లోకెళ్తే.. రాష్ట్రంలోని చంద్రాపూర్ జిల్లాలో పిడుగుపాటుకు సంబంధించిన‌ నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో జ‌రిగిన‌ ఘ‌ట‌న‌ల్లో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాల మధ్య ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. చంద్రాపూర్ కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బ్రహ్మపురిలో ఉన్న బేతాలా గ్రామంలో గీతా డోంగే అనే 45 ఏళ్ల మహిళ పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగు పడింది. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మరో ఘటనలో కల్పనా ప్రకాశ్ జోడే, శ్రీమతి పరసోడే అనే ఇద్దరు మహిళలు సింధేవాహి తహసీల్ పొలాల్లో పని చేస్తుండగా పిడుగు పడింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

కోర్పానా తాలూకాలోని ఖైర్గావ్ లో పురుషోత్తమ్ పరాచకే అనే 25 ఏళ్ల రైతు తన పొలంలో ప‌నిచేస్తుండ‌గా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. నాల్గవ సంఘటన గోండిపారి తాలూకా చివండాలో జరిగింది. ఇక్కడ గోవింద టేకం అనే అటవీ కార్మికుడు అటవీ శాఖలో చెట్ల పెంపకం పనులు చేస్తుండగా పిడుగు ప‌డ‌టంతో మరణించాడు. మరోవైపు పిడుగుపాటు కేసుల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదిలావుండ‌గా, ముంబ‌యి నగరం, శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) జారీ చేసిన 'రెడ్' అలర్ట్ శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు కొనసాగనుంది. ఐఎండీ జారీ చేసిన 'రెడ్' అలర్ట్ దృష్ట్యా ముంబ‌యి, థానే, నవీ ముంబైలోని పాఠశాలలు, కళాశాలలకు నేడు సెలవు ప్రకటించారు. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) బుధ‌వారం ఈ ఉత్తర్వును జారీ చేసింది. మహారాష్ట్రలోని రాయ్ గ‌ఢ్, రత్నగిరి, సాంగ్లీ, గడ్చిరోలి జిల్లాల్లో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు.