ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతూ సాగి చివరకు నేటి ఉదయం మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. ట్విస్టుల్లోనే మహా ట్విస్టుగా శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. 

ఈ వరుస పరిణామాలతో యావత్ దేశం దృష్టంతా మహారాష్ట్రవైపుగా మళ్లింది. కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరిగా తమ విస్మయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. ఉదయం అభిషేక్ మను సింఘ్వి ట్వీట్ చేయగా, కొద్దిసేర్పాటి తరువాత మహారాష్ట్ర కీలక నేత మిలింద్ దేవరా ఒక ఆసక్తికర ట్వీట్ చేసారు. 

గాడ్ ఫాదర్ సినిమా తోని మహారాష్ట్ర రాజకీయాలను పోల్చాడు. గాడ్ ఫాదర్ సినిమాలో ఉన్న ఫేమస్ డైలాగ్ ను అక్కడ పోస్ట్ చేసారు. మిత్రులను దగ్గరగా  ఉంచుకోవాలి,కానీ  శత్రువులను మాత్రం మరింత దగ్గరగా ఉంచుకోవాలని వ్యంగ్యంగా ట్వీట్ చేసాడు. 

ఇకపోతే ఉదయం అభిషేక్ మను సింగ్వి కూడా ట్వీట్ చేసారు.  మహారాష్ట్ర పరిణామాలను తొలుత ఫేక్ న్యూస్ గా భావించానని కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. 

 

‘‘మహారాష్ట్ర గురించి నేను చదివింది నిజం కాదేమో. ఇది ఫేక్ న్యూస్ ఏమో అనుకున్నాను. నా మనసులో మాట చెప్పాలంటే మాత్రం... మా మూడు పార్టీల మధ్య చర్చలు మూడు రోజులకు మించి జరగాల్సింది కాదు. చర్చల్లో చాలా జాప్యం జరిగింది. మాకంటే వేగంగా పావులు కదిపిన వారికి ఛాన్స్ దక్కింది. పవార్ జీ... తుస్సీ గ్రేట్ హో(మీరు మహానుభావులు.. గొప్పవారు) ఇదే నిజమైతే నిజంగా ఆశ్చర్యమే..’’ అని రాసుకొచ్చారు. 

Also read: ఎన్సీపీ ఆఫీస్ వద్ద హై డ్రామా: పార్టీ నుండి అజిత్ పవార్ సస్పెన్షన్

ఇకపోతే, సుస్థిరమైన పాలన అందిస్తామని రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్ చెప్పారు. ఖిచిడీ ప్రభుత్వాలు మహారాష్ట్రకు అవసరం లేదన్నారు. స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు అజిత్ పవార్ చెప్పారు. 

ప్రజలు తమకు స్పష్టమైన ఆదేశాలిచ్చారని ఆయన అన్నారు. మహారాష్ట్రకు సుస్థిరమైన ప్రభుత్వం అవసరమని, కిచిడీ ప్రభుత్వం కాదని ఆయన అన్నారు. శివసేన ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకుందని ఆయన చెప్పారు. 

మహారాష్ట్రలో రైతు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని, దాంతో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నట్లు అజిత్ పవార్ చెప్పారు. 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి సహా కేబినెట్ పదవులన్నీ 50-50 ఫార్ములా ద్వారా పంచుకోవాల్సిందేనంటూ శివసేన డిమాండ్ చేయడం, అందుకు బీజేపీ అంగీకరించక పోవడంతో ప్రభుత్వ ఏర్పాటు నిలిచి పోయిన సంగతి తెలిసిందే.