మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ సీఎం ఉద్దవ్ ఠాక్రే.. శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు భావోద్వేగంతో కూడిన విజ్ఞప్తి చేశారు. ముంబైకి తిరిగి వచ్చి తనతో మాట్లాడాలని రెబల్ ఎమ్మెల్యేలకు రాసిన లేఖలో కోరారు.

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ సీఎం ఉద్దవ్ ఠాక్రే.. శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు భావోద్వేగంతో కూడిన విజ్ఞప్తి చేశారు. ముంబైకి తిరిగి వచ్చి తనతో మాట్లాడాలని రెబల్ ఎమ్మెల్యేలకు రాసిన లేఖలో కోరారు. సమయం ఇంకా మించి పోలేదని.. ముంబైకు వస్తే చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామని కోరారు. శివసేన ఇచ్చిన గౌరవం మరెక్కడా దొరకదని అన్నారు. ‘‘కుటుంబ పెద్దగా నేను ఇప్పుడు కూడా మీ గురించి ఆందోళన చెందుతున్నాను.. మీరు ఇప్పటికీ శివసేనలోనే ఉన్నారు. ఇంకా సమయం మించి పోలేదు. మీరు వచ్చి మాతో కూర్చొని మాట్లాడండి. శివసైనికులు, ప్రజల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించండి. అందరం కలిసి ఒక పరిష్కారం కనుగొద్దాం’’ అని ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. 

‘‘గౌహతిలో చిక్కుకున్న ఎమ్మెల్యేలకు సంబంధించి గత కొద్ది రోజులుగా రోజుకో కొత్త సమాచారం బయటకు వస్తోంది. శివసేన కుటుంబ పెద్దగా మీ మనోభావాలను గౌరవిస్తాను మీరు ముందుకు వచ్చి మాట్లాడితే ఒక మార్గం కనుగొంటాం’’ అని ఠాక్రే చెప్పారు. ఇక, ప్రస్తుతం శివసేన రెబల్ ఎమ్మెల్యేలు అంతా అస్సాం గౌహతిలోని ఓ హోటల్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 

Also Read: శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ కు ఈడీ స‌మ‌న్లు.. జూలై 1న హాజ‌రుకావాల‌ని ఆదేశాలు

ఇక, కొద్ది రోజుల కిందట కూడా శివసేన నుంచి ఇటువంటి ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. సంకీర్ణ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సంజయ్ రౌత్ జూన్ 23వ తేదీన వెల్లడించారు. అయితే 24 గంటల్లో రెబల్‌ ఎమ్మెల్యేలు ముంబై చేరుకుంటే.. కూటమి నుంచి వైదొలిగే అంశాన్నిపరిశీలిస్తామని అన్నారు. తమ డిమాండ్లన్నీ పరిగణలోకి తీసుకుంటామన్నారు. 

ఇక, మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మహారాష్ట్ర పొలిటికల్ డ్రామా ఇప్పుడు ఢిల్లీకి మారింది. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకన్నారు. బీజేపీ అధిష్టానం పిలుపుతోనే ఆయన ఢిల్లీ చేరుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈరోజు ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భేటీలో మహారాష్ట్రలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను అమిత్ షాకు ఫడ్నవీస్ వివరించే అవకాశం ఉంది. అలాగే అమిత్ షా కూడా రాష్ట్రంలో బీజేపీ అనుసరించాల్సిన వైఖరిపై ఫడ్నవీస్‌కు కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే శివసేన రెబ‌ల్ ఎమ్మెల్యేల క్యాంపుకు నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే కూడా నేడు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. ఢిల్లీలో దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఏక్‌నాథ్ షిండే భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా బీజేపీ నేతలతో ఏక్‌నాథ్ షిండ్ టచ్‌లో ఉన్నాడని.. ఇటీవల కొందరు కీలక నేతలతో రహస్యంగా భేటీ అయినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే శివసేన రెబల్స్‌తో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏక్‌నాథ్ షిండే క్యాంపులోని పలువురికి మంత్రి పదవులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. 

త్వరలోనే ముంబైకి రెబల్స్..
త్వరలోనే తాను, తనతోపాటు ఉన్న ఎమ్మెల్యేలు మహారాష్ట్ర చేరుకుంటామని ఏక్‌‌నాథ్ షిండే చెప్పారు. తమ వద్ద ఉన్న ఎమ్మెల్యేలు ఉద్దవ్ వర్గంతో టచ్‌లో ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దవ్‌ వర్గంతో టచ్‌లో ఉన్న ఆ ఎమ్మెల్యేల పేర్లు బహిర్గతం చేయాలని సవాలు చేశారు. అయితే ఏక్‌నాథ్ షిండే వర్గం మహారాష్ట్రకు చేరుకున్న తర్వాత పరిణామాలు మరింత వేగంగా మారే అవకాశం ఉంది.