మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ కావాలని తీసిన ఓ వీడియో ఆయనను ఇరకాటంలో పెట్టింది. బైక్ పై స్నానం చేస్తూ షూట్ చేయించుకున్న వీడియో పై మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది.
ముంబయి: సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్లు కావాలని ఇప్పుడు చాలా మంది శృతిమించిపోతున్నారు. తమ చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావాలని హద్దు దాటి ఇతరులకు ఇబ్బంది పెట్టే వరకు వెళ్లుతున్నారు. ఇలాంటి ఓ ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఎండలు మండిపోతున్నాయని ఓ వ్యక్తి బైక్ పై స్నానం చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది. దాన్ని తలపించేలా.. థానేలో ఓ వ్యక్తి ఇదే విధంగా బైక్ మీద స్నానం చేశాడు.
బైక్ పై ఆ వ్యక్తి కూర్చుని ఉండగా.. వెనుక ఓ మహిళ ఓ బకెట్ పట్టుకుని ఉన్నది. ఆ బకెట్‌లో నీళ్లు, ఓ మగ్ ఉన్నది. థానేలో ఓ చోట ట్రాఫిక్ ఏరియాలో వారి బైక్ ఆగి ఉండగా.. ఆమె బకెట్‌లో నుంచి మగ్ తీసి నీరు పైన పోసుకుంది. ఆ తర్వాత మరోసారి మగ్‌లో నీళ్లు ముంచి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిపై నీళ్లు పోసింది. కార్లు, ఇతర వాహనాలు ఆ రోడ్డులో రద్దీగా కనిపిస్తుండగా వారి బైక్ డ్రైవింగ్ చేస్తుండగా కూడా ఇలాగే ఆమె నీళ్లు పోసింది. ఇద్దరూ నీళ్లు పోసుకుంటూ స్నానం చేశారు. మహారాష్ట్ర థానేలోని ఉల్లాస్‌నగర్‌లో ఈ వీడియో షూట్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వీడియోను వీ డిజర్వ్ బెటర్ గవర్నమెంట్ అనే ట్విట్టర్ హ్యాండిల్ పోస్టు చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్ పేరిట ఇలాంటి నాన్‌సెన్స్ వీడియోలు తీస్తున్నారని.. ఇది ఉల్లాస్‌నగర్‌లో సెక్షన్ 17లోని మెయిన్ సిగ్నల్ వద్ద చోటుచేసుకుందని పేర్కొన్నారు. ఈ వీడియో చూసి మరింత మంది ఇలాంటి నాన్‌సెన్స్ చేయడానికి ముందు వారిపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర పోలీసులను కోరారు. మహారాష్ట్ర ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చామని, చర్యలు తీసుకుంటారని సమాధానం వచ్చింది.
ఈ వీడియోలోని వ్యక్తి పేరు ముంబయికి చెందిన ఆదర్శ్ శుక్లా. ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని పోలీసులు వార్నింగ్ ఇవ్వగా ఆయన క్షమాపణలు చెప్పారు. హెల్మెట్ ధరించకపోవడం తాను చేసిన పెద్ద తప్పు అని అన్నారు. తనను ఎవరూ అరెస్టు చేయలేదని, వదంతులు వ్యాపింపచేయవద్దని కోరారు.
